India Remittances In 2021: ప్రవాసీ నిధుల ఆకర్షణలో భారత్‌ టాప్‌.. ఈ ఏడాది రూ. 6.47 లక్షల కోట్ల రాక

19 Nov, 2021 16:42 IST|Sakshi

విదేశాల నుంచి డబ్బు పంపడంలో మనోళ్లే ఫస్ట్‌!

2021లో భారత్‌కు 87 బిలియన్‌ డాలర్ల రెమిటెన్సులు

అమెరికా నుంచి వస్తోందే ఎక్కువ

20 శాతంతో మొదటి స్థానంలో అగ్రదేశం

ప్రపంచ బ్యాంక్‌ నివేదిక 

వాషింగ్టన్‌: విదేశాల నుంచి స్వదేశానికి డబ్బు పంపడంలో (రెమిటెన్సులు) భారతీయులే మొదట నిలుస్తున్నారు. భారతీయుల తర్వాత స్థానంలో చైనా, మెక్సికో, ఫిలిప్ఫైన్స్‌, ఈజిప్టు దేశాలు అత్యధికంగా ప్రవాసీయుల నుంచి నిధులు అందుకుంటున్న దేశాలుగా నిలిచాయి. ఈ విషయాలను వాషింగ్టన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం ప్రపంచబ్యాంక్‌ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 2021లో ఇలా దేశానికి రానున్న మొత్తం 87 బిలియన్‌ డాలర్ల నిధులు ఇప్పటికే వచ్చాయి. గతేడాది ఈ మొత్తం 83 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

అమెరికా నుంచే అధికం
ప్రవాసీయుల నుంచి ఇండియాకు అందుతున్న నిధుల్లో 20 శాతం వరకు అమెరికా నుంచి వస్తున్నాయి. యూఎస్‌ఏలో సెటిలైన ఎన్నారైలు ఇండియాలో ఉన్న తమ వారికి భారీ ఎత్తున నగదు పంపిస్తున్నారు. గతంలో  ప్రవాసీ నిధులు అధికంగా అందించడంలో గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వలక కార్మికులు ముందుండే వారు. 

గల్ఫ్‌ పై కోవిడ్‌ ఎఫెక్ట్‌
గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ప్రవాసీయులు పంపించే నిధులు ఈసారి తగ్గిపోయాయి. కరోనా కారణంగా వలస కార్మికుల్లో చాలా మంది ఇండియాకు తిరిగి వచ్చేశారు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా వీరంతా తిరిగి గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. ఒకసారి పరిస్థితులు చక్కబడితే మరోసారి గల్ఫ్‌ దేశాల నుంచి ఇండియాకి నిధుల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని వివరాలు
- భారత్‌కు రెమిటెన్సులు 2022లో 3 శాతం పెరిగి 89.6 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని అంచనా.  
- దిగువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలకు  రెమిటెన్సుల మొత్తం 2021లో 7.3%  పెరిగి 589 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.  
- 2020తో పోల్చితే రెమిటెన్సుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే వీలుంది. కోవిడ్‌–19 సవాళ్ల తీవ్రత తగ్గడం దీనికి కారణం.  
- కోవిడ్‌–19 సంక్షోభ సమయంలో పలు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ ఇబ్బందుల పరిష్కారానికి, సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ నగదు బదిలీ కార్యక్రమాలకు తోడు రెమిటెన్సుల తోడ్పాటు ఎంతగానో ఉందని ప్రపంచబ్యాంక్‌ సామాజిక, ఉపాధి పరిరక్షణా వ్యవహారాల డైరెక్టర్‌ మైఖేల్‌ పేర్కొన్నారు.

చదవండి:సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఐఐటీ, ఢిల్లీ క్యాంపస్‌లు

>
మరిన్ని వార్తలు