YSR Jayanti Celebrations: అమెరికాలో ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు 

10 Jul, 2023 10:46 IST|Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. జులై 8న వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలు భారీగా తరలివచ్చారు. అమెరికాలో పర్యటిస్తోన్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ సజ్జల భార్గవ్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.‘జోహార్‌ వైఎస్సార్‌.. వైఎస్సార్‌ అమర్‌రహే’’ అంటూ నినదించారు. మహానేత అందించిన పథకాలను గుర్తుచేసుకున్నారు. 

గౌతంరెడ్డి, ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌
పరిపాలనలో వైఎస్సార్‌ తన దైన ముద్ర వేశారు. తనకు ఇచ్చిన అధికారం పేదలకు సేవ చేసేందుకే తప్ప.. దర్పం ప్రదర్శించేందుకు కాదని చేతల్లో  చూపించారు వైఎస్సార్‌. చరిత్రలో వైఎస్సార్‌ ఎప్పటికీ నిలిచిపోతారు. తన నడవడిక, గొప్ప మనసు, మంచి నిర్ణయాలతో వైఎస్సార్‌ చెరగని ముద్ర వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో మేలు జరిగింది. రేషన్‌ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 

కడప రత్నాకర్‌, అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి
విశ్వసనీయతకు చిరునామా వైఎస్సార్‌ మాత్రమే. ఇచ్చిన ఏ హామీ అయినా తీర్చేవరకు విశ్రమించలేదు వైఎస్సార్‌. అయిదున్నర కోట్ల మంది ప్రజలకు పేదవాళ్లకు అందాల్సిన పథకాలు 99% అమలు చేసిన ఘనత నాడు వైఎస్సార్‌ది, నేడు వైఎస్‌ జగన్‌ది. భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసిన ఘనత వైఎస్సార్‌ది, వైఎస్‌ జగన్‌దే. రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలన్న తప్పనతో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి ఫలితాలు చూపించిన మహానేత వైఎస్సార్‌. 

మేడపాటి వెంకట్‌, ఏపీ NRT అధ్యక్షులు
ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించి వాటిని అమల్లోకి తెచ్చి చూపించిన నాయకుడు వైఎస్సార్‌. రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ దాని వల్ల లక్షలాది మంది అన్నదాతలకు మేలు జరిగి ఆత్మహత్యలు తగ్గిపోయాయి. పేదలకు ఆర్థిక స్తోమత లేక వైద్య చికిత్స పొందలేకపోయిన వారిని పాదయాత్రలో చూసి ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ ఆసుపత్రిలో సరైన వైద్యం అందేలా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు తెచ్చిన 108 అంబులెన్స్‌ పథకాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పుడు ప్రతీ చోట కనిపిస్తోందంటే అది వైఎస్సార్‌ ఘనతే. 

రమేష్‌ రెడ్డి వల్లూరి, వైఎస్సార్‌సిపి కన్వీనర్‌, ఉత్తర అమెరికా
నాయకుడు ఎవరైన.. పార్టీ ఏదైనా.. రాజకీయాలు చేయండి. ఒక హామీ ఇవ్వండి కానీ దాన్ని మరిచిపోవద్దు. అది అమలు అయ్యేవరకు అంతే స్థాయిలో కష్టపడండి. మీరిచ్చే హామీలు ఓట్ల కోసం కాదని తమ పరిపాలనతో గుర్తుచేసిన నాయకులు ఇద్దరు. ఒకరు మహానేత, ఉమ్మడి రాష్ట్రానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌. మరొకరు నేటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం జగన్‌. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్సార్‌. అలాంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్‌ చేసుకున్న పుణ్యం. 2003-04లో పాదయాత్ర ద్వారా నాడు వైఎస్సార్‌, అలాగే 2018-19లో వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం నడిచారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చారు. 2024లో వైఎస్ జగన్ పెట్టుకున్న 175/175 లక్ష్యాన్ని వంద శాతం చేరుకుంటారని, ప్రజలు మరోసారి అద్భుత విజయాన్ని కట్టబెడతారని బలంగా నమ్ముతున్నాం. 

వాషింగ్టన్ డీసీలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల వీడియో ఈ కింద చూడవచ్చు

మరిన్ని వార్తలు