అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్లు అరెస్ట్‌

17 Mar, 2023 01:36 IST|Sakshi
మాట్లాడుతున్న డీసీపీ మేరీ ప్రశాంతి
వివరాలు వెల్లడించిన డీసీపీ మేరీ ప్రశాంతి

విజయవాడ స్పోర్ట్స్‌: అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్లను ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 580 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డెప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(డీసీపీ) మేరీ ప్రశాంతి గురువారం వెల్లడించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు జరిగాయి. పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను జిల్లా పోలీస్‌ యంత్రాంగం వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే ఈ నెల 15వ తేదీన నందిగామ శివారులోని జాతీయ రహదారి వై జంక్షన్‌ వద్ద అనుమానాస్పదంగా సంచిరిస్తున్న గొర్రె శ్రీనివాస్‌(తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొణిజర్ల), చల్లా వెంకటేశ్వర్లు(తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిపల్లి), కొనగళ్ల గణేష్‌(తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సుక్రవరపుపేట), దేవనబోయిన మహేష్‌( తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం)ను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు అంగీకరించడంతో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ ప్రశాంతి చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నిందితులు నలుగురు ఇప్పటి వరకు 16 చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. 16 ఘటనల్లో ఎనిమిది ఘటనలు విజయవాడలో జరిగాయన్నారు.

జల్సాలకు అలవాటు పడి..

నిందితులు గొర్రె శ్రీనివాస్‌, చల్లా వెంకటేశ్వర్లు బంధువులు.. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసేవారని డీసీపీ చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితులు కొనగళ్ల గణేష్‌, దేవనబోయిన మహేష్‌లతో వీరిద్దరి జైలులో పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి నలుగురు ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. 16 ఘటనల్లో నిందితులు దొంగిలించిన సొత్తు మొత్తాన్ని రికవరీ చేశామన్నారు. అదేవిధంగా దొంగతనాలకు నిందితులు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా నిందితులను అరెస్ట్‌ చేసి వేగవంతంగా కేసును విచారించిన నందిగామ ఏసీపీ జి.నాగేశ్వరరెడ్డి, సీఐ కె.సతీష్‌, ఎస్‌ఐలు పి.సురేష్‌, ఎం.పండుదొర, హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.తిరుపతిరావు, కానిస్టేబుళ్లు ఎన్‌.సంతోష్‌, బి.పూర్ణచంద్రరావును అభినందించి రివార్డును అందజేశారు.

మరిన్ని వార్తలు