లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు

18 Mar, 2023 00:46 IST|Sakshi

చిలకలపూడి(మచిలీపట్నం): దివ్యాంగురాలిపై లైంగికదాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ ఫజులుల్లా శుక్రవారం తీర్పు చెప్పారు. చందర్లపాడు మండలం కాసరబాద గ్రామంలో 12 సంవత్సరాల దివ్యాంగురాలిపై 2015 జనవరి 6వ తేదీన అదే గ్రామానికి చెందిన కోట బాబూరావు లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఏపీపీ ముంజులూరి వెంకటమహేష్‌ 15 మంది సాక్ష్యులను విచారించగా నిందితుడు బాబూరావు పై నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి జీవిత ఖైదు, రూ. 1500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

కోనేరుసెంటర్‌: కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన దేవరకొండ శివలక్ష్మయ్య, మొగిలి వెంకట రవికుమార్‌ జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. కొన్ని రోజులుగా శివలక్ష్మయ్య మార్కెట్‌యార్డులోని ఈవీఎంల రక్షణలో విధులు నిర్వహిస్తున్నాడు. లక్ష్మయ్య విధుల్లో ఉండగా వెంకటరవికుమార్‌ పూటుగా మద్యం తాగి మార్కెట్‌ యార్డులోకి వెళ్లాడు. విధి నిర్వహణలో ఉన్న లక్ష్మయ్య చెంపపై కొట్టటంతో పాటు మెడ పట్టుకుని బలంగా వెనక్కి తోశాడు. ఈ ఘటనలో లక్ష్మయ్య సమీపంలోని నాపరాయిపై పడటంతో తలకు బలమై గాయమైంది. బాధితుడు జరిగిన విషయాన్ని ఏఆర్‌ అధికారులకు ఫోన్‌ చేసి చెప్పాడు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మయ్యను వైద్యం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించారు. రవికుమార్‌ తీరుపై ఎస్పీ జాషువా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి ఉద్యోగిపై దాడికి పాల్పడిన రవికుమార్‌ను అప్పటికప్పుడు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు శుక్రవారం రవికుమార్‌ను కోర్టులో హాజరు పరచినట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో

ఫైబర్‌ టెక్నీషియన్‌ మృతి

కంచికచర్ల: విద్యుత్‌షాక్‌తో ప్రైవేటు టెక్నీషియన్‌ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీవీఎస్‌ సుబ్రహ్మణ్యం కథనం మేరకు మోడల్‌కాలనీకి చెందిన నరసాపురపు రాజేష్‌ (32)అనే వ్యక్తి ఏపీ ఫైబర్‌ నెట్‌లో ప్రైవేటు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మండలంలోని బత్తినపాడు వెళ్లే ఫైబర్‌ కేబుల్‌ను కనెక్ట్‌ చేసేందుకు విద్యుత్‌పోల్‌ ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్‌వైర్లు తగలటంతో కింద పడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మరిన్ని వార్తలు