30 కల్లా పంట నష్టం నమోదు పూర్తికావాలి

22 Mar, 2023 02:10 IST|Sakshi
కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు

కంకిపాడు(పెనమలూరు): అకాల వర్షానికి జరిగిన పంట నష్టం నమోదు ప్రక్రియను ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌.వై.వి.ఎస్‌.మనోహరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయం నుంచి మనోహరరావు పాల్గొన్నారు. అకాల వర్షాలు, పంట నష్టం నమోదు తదితర అంశాలపై గోపాలకృష్ణ ద్వివేది, హరికిరణ్‌ పలు సూచనలు చేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు మాట్లాడుతూ.. కోస్తాంధ్రపై ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయన్నారు. వర్షాల కారణంగా మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పసుపు ఇతర పంటలకు జరిగిన నష్టాలను సమర్థంగా నమోదు చేయాలని ఆదేశించారు. నమోదు ప్రక్రియ ఉన్నతాధికారుల ఆదేశా లకు అనుగుణంగా ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి కావాలని స్పష్టంచేశారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి మూడో తేదీ వరకూ సామాజిక తనిఖీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. నాలుగో తేదీన తుది జాబితాను కమిషనరేట్‌కు సమర్పించాల్సి ఉందన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి, డివిజన్‌ స్థాయి బృందాలు అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని సమగ్రంగా, సమర్థంగా నమోదు చేసి నివేదికలను రూపొందించాలని స్పష్టంచేశారు. సమీక్షలో జిల్లా ఉద్యా నశాఖ అధికారి జ్యోతి, పలువురు డివిజన్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు