భావి భారతం.. రక్తహీనత రహితం..

27 Mar, 2023 01:28 IST|Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): భావి భారతా వనిని రక్తహీనత రహితంగా మార్చడానికి వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమియాతో ఉన్న వారిని గుర్తించి, దానిని అధిగమించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఎనీమియా ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ఢిల్లీరావు ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్‌జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని ‘సాక్షి’కి వివరించారు. రక్తహీనతను అధిగమించడానికి వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న కార్యక్రమాలను ఆమె వివరించారు.

ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, పాలిటెక్నిక్‌, ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఏడాదికి రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వాటి పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను అనుసంధానం చేశారు. ఆరోగ్యకేంద్రాల వైద్యులు, సిబ్బంది ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం, ప్రతి విద్యార్థి కి హిమోగ్లోబిన్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వారిలో హెచ్‌బీ శాతం తక్కువగా ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ఇస్తారు.

ఏజ్‌గ్రూప్‌ను బట్టి కలర్‌ కోడింగ్‌

రక్తహీనత లేకుండా పిల్లలకు, గర్భిణులకు ఇచ్చే ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలకు ఏజ్‌ గ్రూప్‌ ఆధారంగా కలర్‌ను నిర్ణయించారు.

● ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ సిరప్‌లను తల్లులకు అందజేస్తున్నారు. ఆ సిరప్‌ను పిల్లలకు ప్రతి బుధ, శనివారం వేసేలా అవగాహన కలిగిస్తున్నారు.

● ఆరేళ్ల నుంచి పదేళ్ల చిన్నారులకు ప్రైమరీ పాఠశాలల్లో పింక్‌ కలర్‌ ఐరన్‌ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను ప్రతి గురువారం మధ్యాహ్న భోజనం తర్వాత అందజేస్తున్నారు.

● పదేళ్ల నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు బ్లూ కలర్‌ ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను అందజేస్తున్నారు. ప్రతి గురువారం మధ్యాహ్న భోజనం తర్వాత ఇస్తారు.

● వెద్య పరీక్షల్లో ఎనీమియా ఉన్నట్లు గుర్తించిన పిల్లలకు అన్ని రోజులూ ఐరన్‌ మాత్రలు ఇస్తారు

● గర్భం దాల్చిన 12 వారాల తర్వాత రెడ్‌ కలర్‌ ఐరన్‌ మాత్రలు అందిస్తున్నారు. బాలింతలకు ప్రసవం తర్వాత 12 వారాల పాటు రెడ్‌కలర్‌ ఐరన్‌ మందులను వైద్య సిబ్బంది అందిస్తున్నారు.

● పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వం రాగిజావను అందిస్తున్నారు. దీంతో రక్తహీనతను అధిగమించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

● తాజాగా తాటి బెల్లం పంపిణీకి కూడా శ్రీకారం చుట్టనున్నారు.

రక్తహీనత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఐరన్‌ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ఏజ్‌ గ్రూప్‌ ఆధారంగా మాత్రలకు కలర్‌ కోడింగ్‌ ప్రతి పాఠశాలలో ఏడాదికి రెండుసారు హిమోగ్లోబిన్‌ పరీక్షలు డీఎంఅండ్‌హెచ్‌ఓ సుహాసిని

పక్కాగా పర్యవేక్షణ

పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఐరన్‌ బిళ్లలను తప్పకుండా వేసుకునేలా పక్కాగా పర్యవేక్షణ జరుగుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుహాసిని తెలిపారు. దీనిలో భాగంగా విద్యాశాఖ, సీ్త్ర శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, వైద్య సిబ్బంది అందరూ కలిసి సమష్టిగా కృషి చేసినప్పుడు రక్తహీనత రహిత సమాజం రూపుదిద్దుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు