కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య

27 Mar, 2023 01:28 IST|Sakshi
మృతి చెందిన సుందర్‌కుమార్‌

ఆటోనగర్‌(విజయవాడతూర్పు): కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి దూలానికి తాడుతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పాత పోస్టాఫీస్‌ వీధిలో జరిగింది. ఘటనలో యర్రబోతుల చిన్నోడు మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు... విజయవాడ సత్యనారాయణ పురానికి చెందిన లక్ష్మితో చిన్నోడుకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. వివాహం తర్వాత విజయవాడలో స్థిరపడ్డాడు. అతను రోజువారీ కూలి పనులకు వెళుతున్నాడు. కొంత కాలంగా వీరి జీవితం బాగానే సాగింది. రాను రానూ భర్త చిన్నోడు కూలి పనులకు సరిగా వెళ్లకుండా మద్యం సేవిస్తున్నాడు. భార్యా భర్తల మధ్య రోజూ గొడవ జరుగుతోందిది. వాదులాడుకుంటున్నారు. అయిదు రోజుల క్రితం వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సత్యనారాయణపురంలోని తల్లిదండ్రుల ఇంటికి లక్ష్మి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రేకుల షెడ్డులోని దూలానికి తాడు వేసుకొని చిన్నోడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పక్కన ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి బంధువులకు తెలిపారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లక్ష్మి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వించిపేటలో..

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): ఇంట్లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వించిపేట నైజాంగేటు ప్రాంతానికి చెందిన సోమి సుందర్‌కుమార్‌(25), పూలమ్మ దంపతులు. పూలమ్మ గర్భిణి. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో సుందర్‌కుమార్‌ తల్లి కుమారి, చెల్లెలు పార్వతితో కలిసి ఉంటున్నాడు. అతనికి కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేదు. నగరంలోని ప్రయివేటు ఆస్పత్రి, ప్రభుత్వాస్పత్రిలో మందులు వాడుతున్నారు. ఆదివారం ఉదయం తల్లి చర్చికి వెళ్లగా, పార్వతి తన భర్తతో కలిసి పనికి వెళ్లింది. ఉదయం 7.15 గంటలకు కుమారి ఇంటికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా కుమారుడు సుందర్‌కుమార్‌ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె వెంటనే కూతురు పార్వతికి ఫోన్‌ చేసి ఇంటికి రావాలని చెప్పింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. తల్లి కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు