నాటక రంగం తెలుగు వారి ఆత్మ

27 Mar, 2023 01:32 IST|Sakshi
వైవీ కృష్ణారావును సత్కరిస్తున్న నిర్వాహకులు

విజయవాడ కల్చరల్‌: నాటక రంగం తెలుగు వారి ఆత్మ అని.. దాని అభివృద్ధికి నాటక రంగ ప్రియులు కృషి చేయాలని సంస్కార భారతి, సాంస్కృతిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పీవీఎన్‌ కృష్ణ అన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో బందరు రోడ్డు బాలోత్సవ్‌ భవన్‌లో ఆదివారం ఉగాది సంబరాలు, తెలుగు నాటక రంగ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ పీవీఎన్‌ కృష్ణ మాట్లాడుతూ నాటకం ద్వారా గురజాడలాంటి మహనీయులు సమాజంలో మార్పుకోసం కృషి చేసినట్లు తెలిపారు. విద్యావేత్త చలువాది మల్లికార్జునరావు మాట్లాడుతూ నైతిక విలువలు, దేశ భక్తి కలిగిన సంస్కారవంతమైన యువకులుగా తీర్చిదిద్దటానికి సంస్కార భారతి కృషి చేస్తోందన్నారు. సంస్కార భారతి విజయవాడ శాఖ అధ్యక్షుడు పసుమర్తి భాస్కర శర్మ సంస్కార భారతి ద్వారా యువతీ యువకులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటక రంగంలో వివిధ శాఖలకు చెందిన వైవీ కృష్ణారావు, కె. పరబ్రహ్మాచారి, విజయదుర్గ, కె. దుర్గారావు, శ్రావణకుమార్‌లకు ఉగాది పురస్కారాలు అందించి, ఆత్మీయ సత్కారం చేశారు. డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ పంచాగ పఠనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్‌ శాఖ కార్యదర్శి దుర్బా శ్రీనివాస్‌, అమరావతి బాలోత్సవ్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు