శాడిస్టు భర్త.. భార్యపై అనుమానం, ఉద్యోగానికి వెళ్లనివ్వకుండా..

9 Apr, 2023 12:24 IST|Sakshi

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): భర్త వేధింపులు తాళలేని ఓ వివాహిత బలన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ రాజశేఖర్‌ కథనం మేరకు.. మచిలీపట్నం బందరుకోటకు చెందిన పేటేటి లిఖిత (22)కు కోడూరు మండలం హంసలదీకి గ్రామానికి చెందిన ఇజిటి గోపాల కృష్ణతో గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. దంపతులు మచిలీపట్నంలోని ఈడేపల్లిలో కాపురం మొదలుపెట్టారు. కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో గోపాలకృష్ణ కారణంగా కలతలు మొదలయ్యాయి.

గోపాలకృష్ణ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండటంతో పాటు భార్యను తరుచూ అనుమానించటం మొదలుపెట్టాడు. కుటుంబ పోషణను పట్టించుకోకుండా తిరగడం, భార్యను ఉద్యోగానికి పంపకుండా మానసికంగా వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గోపాలకృష్ణ తిట్టటంతో మనస్తాపానికి గురైన లిఖిత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఉరివేసుకోవడాన్ని గోపాలకృష్ణ గుర్తించి ఉరి నుంచి కిందికి దింపి చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో చేర్చాడు.

ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లిఖిత పరిస్థితి విషమించి మంగళవారం కన్నుమూసింది. విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ రాజశేఖర్‌ విజయవాడలోని ఆస్పత్రికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు. లిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు