ACB Raids: నగేష్‌ మామూలోడు కాదు..

4 May, 2023 11:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఏసీబీ.. అవినీతి అధికారుల భరతం పడుతోంది. 14400 కాల్‌సెంటర్‌, ఏసీబీ యాప్‌లకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేసి, అవినీతి జలగలను కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై విజయవాడలోని పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ అజ్జా రాఘవరావుకు సంబంధించిన ఆస్తులపై మంగళవారం సాయంత్రం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసింది. బుధవారం కూడా ఈ సోదాలు కొనసాగాయి. అలాగే దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌పై వచ్చిన ఆరోపణలపైనా ఏసీబీ అధికారులు బుధవారం ఇంద్రకీలాద్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు.

పెద్ద చేపే..
పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ అజ్జా రాఘవరావు ఆస్తులపై తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు రాఘవరావుతో పాటు మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి పటమట కార్యాలయం, ఆయన ఇల్లు, బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు, తదితర ప్రాంతాల్లో మొత్తం ఆరుచోట్ల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన విలువైన పత్రాలు, నగదు, వాహనాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌కు డబ్బులు కలెక్టు చేస్తున్న ముగ్గురు కీలక ప్రైవేటు వ్యక్తులు అదుపులోకి తీసుకొని ఎవరెవరి నుంచి డబ్బులు కలెక్ట్‌ చేశారో ఆరా తీస్తున్నారు. తాజాగా ఇటీవల రెండు భవనాల కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షల అడ్వాన్స్‌ ఇచ్చినట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు నుంచి ఐదుకోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. మార్కెట్‌ విలువ ఆధారంగా వీటి విలువ రూ.10కోట్ల నుంచి రూ.15కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కొన్ని లాకర్స్‌ను ఓపెన్‌ చేయాల్సి ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 2018లో అవనిగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో జరిగిన సోదాలకు సంబంధించి శాఖాపరమైన చర్య ఇంకా పెండింగ్‌లో ఉంది.

నగేష్‌ మామూలోడు కాదు..
విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఆస్తుల పైనా సోదాలు కొనసాగుతున్నాయి. కుమ్మరిపాలెంలోని లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌, ఫ్లాట్‌ నంబర్‌ ఎఫ్‌–34లోని నివాసం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 6 చోట్ల, దుర్గ గుడిలోని ఏఓ కార్యాలయంతో పాటు ఏఓ బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంకా పలు చోట్ల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అధికారుల సోదాల్లో రూ.5కోట్ల నుంచి రూ.7కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు.

ఇంద్రకీలాద్రిపై కలకలం..
దుర్గగుడి సూపరిండెంటెంట్‌ వాసా నగేష్‌పై బుధవారం అవినీతి నిరోధక శాఖ సోదాలు చేయడంతో ఇంద్రకీలాద్రిపై కలకలం రేగింది. నగేష్‌ తన వ్యక్తిగత పనులపై బుధ, గురువారాలు సెలవుపై వెళ్లారు. అయితే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసిన వెంటనే కొంత మంది నాల్గో అంతస్తులోని కార్యాలయానికి వెళ్లి ఆరా తీసేందుకు ప్రయత్నించగా నగేష్‌ అందుబాటులోకి రాలేదు. గతంలో పాలకవర్గ సమావేశంలో సైతం ఈయన అవినీతిపై ఈవోను పలువురు ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అయితే నగేష్‌పై ఆరోపణలు చేసిన వారు సాక్ష్యాలు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఈవో భ్రమరాంబ ఆ సమావేశంలో దాట వేశారు. పాలక మండలి ఫిర్యాదును సైతం ఈవో బుట్టదాఖలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈయనపైన చర్య తీసుకోకపోడటానికి ప్రధాన కారణం ఈయనే షాడో ఈవోగా వ్యవహరిస్తూ, అన్నీ చక్కబెడుతుండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కీలక బాధ్యతలు ఆయనకే..
ద్వారకాతిరుమల నుంచి ఇంద్రకీలాద్రికి బదిలీపై వచ్చిన నగేష్‌కు ఈవో భ్రమరాంబ ఆలయంలోని పలు విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. దేవస్థానంలో కీలకమైన అంతరాలయ పర్యవేక్షణతో పాటు ప్రసాదాల కౌంటర్లు, టోల్‌గేట్లు నిర్వహణ బాధ్యతలు నగేష్‌ చూస్తారు. అంతే కాకుండా ఆలయం సిబ్బంది పొరపాటున ఏదైనా తప్పు చేసినట్లు గుర్తిస్తే దానికి నగేష్‌నే విచారణ అధికారిగా నియమించడం సర్వసాధారణమైంది. నకిలీ టికెట్ల వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నగేష్‌ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నప్పటీకీ ఈవో వెనకేసుకురావడంతో అది తప్పింది. ఇప్పుడు ఏసీబీ తనిఖీలతో ఆలయ ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడిందని పలు భక్తులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు