ఆంధ్రా తిలక్‌.. హరిసర్వోత్తమరావు

15 Sep, 2023 06:10 IST|Sakshi

కోనేరుసెంటర్‌: వందేమాతరం ఉద్యమంలో పాల్గొని అరెస్ట్‌ కావటం ద్వారా గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రా బాలగంగాధర తిలక్‌గా పేరు గడించారని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. గ్రంథాలయ ఉద్యమ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు 140వ జయంతిని గాడిచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. జాతీయతావాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, బహుభాషా కోవిధుడిగా, పాత్రికేయుడిగా, కవిగా, నాటక రచయితగా, రాజకీయవేత్తగా బహుముఖ పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి హరిసర్వోత్తమరావు అని కొనియాడారు. మహాత్మాగాంధీకి స్థిరమైన అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. 1908లో పూణెలో తిలక్‌ అరెస్ట్‌ అయిన సమయంలోనే బందరులో గాడిచర్ల అరెస్ట్‌ అయ్యారన్నారు. యంగ్‌ ఇండియా పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో మహాత్మాగాఽంధీ గాడిచర్లను ధైర్యశాలిగా కొనియాడారన్నారు. స్వరాజ్య వారపత్రిక నిర్వహించటమే కాకుండా ఆంధ్ర పత్రికకు తొలి ఎడిటర్‌గా సేవలను అందించారన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందంలో గాడిచర్ల విశేష కృషి

గాడిచర్ల అవార్డు గ్రహీత, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ మాతృభాషలో విద్యా విధానం ఉండాలని ఆనాడే గాడిచర్ల బలంగా చెప్పారన్నారు. 1908లో శిక్షకు గురైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గాడిచర్ల జయంతిని మచిలీపట్నంలో నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆనాడు మచిలీపట్నంలో విద్యాభ్యాసం చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డిలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. జాతికి దారి చూపే దీప స్తంభంలా యూనివర్సిటీ విద్యార్థులను తయారుచేయాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. 1937లో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి దోహదపడే శ్రీబాగ్‌ ఒప్పందంలో గాడిచర్ల విశేష కృషి చేశారన్నారు. ఆనాడు ఆంధ్రలో అరెస్ట్‌ కాబడిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల అన్నారు. గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర కల్కురా మాట్లాడుతూ.. బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాల ద్వారా ఉత్తేజం పొందిన గాడిచర్ల జాతీయ ఉద్యమంలోకి వెళ్లారన్నారు. రాష్ట్రంలో ఎంఏ డిగ్రీ పొందిన రెండో వ్యక్తి గాడిచర్ల అన్నారు. అనంతరం గాడిచర్ల ఫౌండేషన్‌ కార్యదర్శి రావి శారద గాడిచర్ల జీవిత చరిత్రను వివరించారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్‌ను గవర్నర్‌ సన్మానించి గాడిచర్ల అవార్డును ప్రదానం చేశారు. కలెక్టర్‌ పి.రాజాబాబు, విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.జ్ఞానమణి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బ్రహ్మచారి, రెక్టార్‌ ఆచార్య సూర్యచంద్రరావు, జిల్లా అధికారులు, గాడిచర్ల ఫౌండేషన్‌ సభ్యులు, యూనివర్సిటీ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణా యూనివర్సిటీలో ఘనంగా గాడిచర్ల జయంతి మండలి బుద్ధప్రసాద్‌కు గాడిచర్ల అవార్డు ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

మరిన్ని వార్తలు