అంతర్జాతీయ కరాటే పోటీలకు జంక్షన్‌ క్రీడాకారులు

21 Nov, 2023 01:26 IST|Sakshi
అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో కోచ్‌ కట్టా సుధాకర్‌

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: విశాఖపట్టణంలో జరగనున్న 19వ డబ్ల్యూకేఐ ఇంటర్నేషనల్‌ కరాటే చాంపియన్‌షిప్‌– 2023 పోటీల్లో పాల్గొనేందుకు హనుమాన్‌జంక్షన్‌కు చెందిన టైగర్‌ పవర్‌ కిక్‌ బాక్సింగ్‌ అండ్‌ కరాటే స్కూల్‌ క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్‌ కట్టా సుధాకర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో విశాఖ పోర్టు స్టేడియంలో జరిగే ఈ కరాటే పోటీల్లో 15 దేశాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారని చెప్పారు. బాలుర విభాగంలో శివ సాయి ఆశ్రిత్‌ (27 కేజీలు), కట్టా మనోజ్‌ (27 కేజీలు), నిమ్మల వృశాంక్‌ (30 కేజీలు), కత్తుల సుందర చైతన్య (31 కేజీలు), కాంచన శర్వానంద్‌ (43 కేజీలు), తమ్మిన సూర్య సత్య నాగ ఈశ్వర్‌, కొనకళ్ల లోకేష్‌ కుమార్‌ (48 కేజీలు), ఆది విష్ణు నీల మణికంఠ (59 కేజీలు) పాల్గొంటారని వివరించారు. బాలికల విభాగంలో మత్తి హర్షిత (31 కేజీలు), మాటూరి సాహిత్యలక్ష్మి (43 కేజీలు), గోలి గోపిక (41 కేజీలు), కొనకళ్ల హారిక ధనలక్ష్మి (66 కేజీలు) పాల్గొంటారని కోచ్‌ కట్టా సుధాకర్‌ చెప్పారు. అంతర్జాతీయ కరాటే పోటీలకు హాజరుకానున్న ఈ క్రీడాకారులను శేరినరసన్నపాలెంకు చెందిన కమ్మిలి సూర్యనారాయణ మూర్తి అభినందించి, ఆర్థికసాయాన్ని అందించారని తెలిపారు.

గన్నవరం–పుట్టగుంట రహదారి విస్తరణకు రంగం సిద్ధం

గన్నవరం: వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే గన్నవరం–పుట్టగుంట ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.35 కోట్లు సీఆర్‌ఎఫ్‌ నిధులతో ప్రస్తుతం ఉన్న రహదారిని బలోపేతం చేయడంతో పాటు విస్తరించనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ శంకుస్థాపన చేశారు. త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్ట్‌ సంస్థ సన్నద్ధమవుతోంది. గన్నవరం నుంచి వయా పుట్టగుంట మీదుగా గుడివాడ వెళ్లేందుకు ఈ రహదారే ప్రధాన మార్గం. గతంలో పోల్చితే ఈ రహదారిపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు విస్తరణ పనులు చేపట్టనున్నారు.

20 కిలోమీటర్ల పొడవునా...

అధ్వానంగా ఉన్న ఈ రహదారిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ చొరవతో 2022లో రూ.9.80 కోట్లతో గన్నవరం నుంచి ఉంగుటూరు వరకు అభివృద్ధి చేసింది. దావాజిగూడెం గ్రామంలో పటిష్టంగా సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో గన్నవరంలోని జీరో పాయింట్‌ నుంచి పుట్టగుంట వరకు 20.690 కిలో మీటర్లు పొడవునా ఏడు మీటర్లు వెడల్పు ఉన్న ఈ రహదారిని పది మీటర్లకు విస్తరించనున్నారు. అంతే కాకుండా భారీ వాహనాల తాకిడిని తట్టుకుని నిలబడే విధంగా రోడ్డును బలోపేతం చేయనున్నారు. దావాజిగూడెం రామాలయం నుంచి గన్నవరంలోని నేషనల్‌ హైవే వరకు సీసీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే గన్నవరం నుంచి పుట్టగుంట వరకు విశాలమైన డబుల్‌ లైన్‌ రోడ్డు అందుబాటులోకి రానుంది.

అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

పెనమలూరు: కానూరులో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం కానూరు ఎస్‌బీఐ కాలనీకి చెందిన కొమ్మినేని సుబ్బారావుకు భార్య ఇద్దరు పిల్లలు. ఆయన ఖమ్మంలో ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తాడు. కుమార్తె లెహన్య(16) విజయవాడలో నారాయణ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కుడి చేయి లాగటం వలన అనారోగ్యంతో సరిగా చదవలేక పోతోంది. ఈ నెల 17వ తేదీన కాలేజీలో ఉండగా జ్వరం రావటంలో టాబ్లెట్‌ వేశారు. మరల 18న కూడా అనారోగ్యంగా ఉండటంతో లెహన్యను కానూరులో ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చూపించారు. అయితే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం క్షీణించటంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను విజయవాడ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు. అక్కడ లెహన్య మృతి చెందింది. ఆమె మరణంపై తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో కేసు నమోదు చేశారు. ఆమె మరణానికి కారణం తెలియలేదు. పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది.

మరిన్ని వార్తలు