ఆకాశంలో అరుదైన దృశ్యం

26 Mar, 2023 02:00 IST|Sakshi

భువనేశ్వర్‌: శుక్రవారం రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించింది. చంద్రునికి అతి సమీపంలో ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. ఇలాంటి అందమైన దృశ్యాన్ని స్థానికులు కొందరు ఇళ్లపై నుంచి తిలకించగా.. మరికొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే పూరీ జగన్నాథుని శ్రీమందిరం ఆలయ శిఖరాన పతిత పావన పతాకం పరిసరాల్లో మరింత స్పష్టంగా ఆకర్షణీయంగా తారసపడడం విశేషం. దీనిపై భువనేశ్వర్‌ లోని పఠాణి సామంత్‌ ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్‌ శుభేందు పట్నాయక్‌ మాట్లాడుతూ.. 2015లో ఒకసారి, మళ్లీ ఇన్నాళ్లకు ఈ దృశ్యం తారస పడిందని తెలపారు.

భూమి, చంద్రుడు, శుక్రుడు ఒకే సరళ రేఖలో ఉండటంతో ఈ విధంగా కనిపిస్తుందన్నారు. తాజా దృశ్యంలో శుక్రుడు కొంత సమయం చంద్రుడి వెనుక ఉండిపోవడంతో ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సాయంత్రం 4.27 గంటలకు ప్రారంభం కాగా, వెలుగు ఉండటంతో భారతదేశంలో కనిపించ లేదన్నారు. సాయంత్రం 6 గంటలకు శుక్రుడు చంద్రునికి చాలా సమీపానికి రాగా.. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో దీనిని పూర్తిగా చూడగలిగారని వెల్లడించారు.

శుక్రుడు, చంద్రుని వెనుక దాక్కుని ఒక చివరలో ప్రవేశించి, మరొకవైపు నుంచి నిష్క్రమించినట్లు వివరించారు. ఈ దృశ్యం రాత్రి 8.30 గంటల వరకు ఆకాశంలో కనిపించింది. మరోవైపు ఈనెల 25నుంచి 30వరకు ఒకే వరుసలో 5 గ్రహాలు కనిపించనున్నాయని సమాచారం. ఈ వ్యవధిలో బుధుడు, శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు, యురేనస్‌, చంద్రుడు సరళ రేఖలో కనిపిస్తారు. ఈనెల 25న సూర్యాస్తమయానికి 45 నిమిషాల తర్వాత ఒకే సరళ రేఖలో 5 గ్రహాలను చూడవచ్చని శుభేందు పట్నాయక్‌ సూచించారు.

మరిన్ని వార్తలు