మోటార్‌ ట్రైసైకిల్‌ లబ్ధిదారుల జాబితా సిద్ధం

31 Mar, 2023 02:24 IST|Sakshi

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మూడు చక్రాల మోటరైజ్డ్‌ వాహనాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక జాబితా సిద్ధమైనట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ పీడీ ఎం.కిరణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంయుక్త కలెక్టరు/చైర్మన్‌గా, ఏడుగురు జిల్లా అధికారులతో కూడిన కమిటీ ఆమోదించిన ఎంపిక జాబితాను జిల్లా వెబ్‌సైట్‌ (rri-kak u a-m.a p.g-o-v.i n)లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 1 సాయంత్రం 5 గంటల్లోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. ఎంపిక కాని వారికి అర్హత ప్రకారం విడతల వారీగా వాహనాలు మంజూరు చేస్తామని తెలిపారు.

సూదిమొనపై రామబాణం

కాశీబుగ్గ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 21వ వార్డుకు చెందిన సూక్ష్మచిత్ర కళాకారుడు కొత్తపల్లి రమేష్‌ఆచారి శ్రీరామనవమి సందర్భంగా పలుచటి బంగారు రేకుపై రామబాణం తయారుచేశారు. 0.100 మిల్లీగ్రాముల బంగారాన్ని వినియోగించి 0.5 సెంటీమీటర్ల పొడవు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఈ బాణాన్ని సిద్ధం చేశారు.

ఆదిత్యుని ఆదాయం రూ.50.10 లక్షలు

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో రికార్డు స్థాయిలో రూ.50,10,437 ఆదాయం సమకూరింది. నగదు రూపంలో రూ.48,11,987 చిల్లర రూపంలో రూ.1,98,450 ఆదాయం లభించిందని ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. వీటితో పాటు 104 గ్రాముల బంగారం, 2,200 గ్రాముల వెండి వస్తువులు లభించినట్లు వెల్లడించారు. విదేశీ మారకద్రవ్యం రూపంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ బి.వి.వి.ఆర్‌.ప్రసాద్‌ పట్నాయక్‌ పర్యవేక్షించగా, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు నెమలపురి కోటేశ్వర చౌదరి, ద్వారపు అనూరాధ, జలగడుగుల శ్రీనివాస్‌, దేవదాయ శాఖ సీనియర్‌ అసిస్టెంట్లు రవికుమార్‌, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వన్‌టౌన్‌ ఎస్సై బలివాడ గణేష్‌ బందోబస్తు నిర్వహించారు. గత నెల 14 నుంచి ఈ నెల 29 వరకు మొత్తం 44 రోజులకు గాను ఈ ఆదాయం లభించినట్లు ఈఓ తెలిపారు. ఎప్పటిలాగే నకిలీ వెండి, బంగారం కళ్లు భారీగా బయటపడటంతో వాటిని తగులబెట్టారు.

వైద్యారోగ్య శాఖలో 39 పోస్టులు

అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టులను ఒప్పంద, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.మీనాక్షి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిజన్‌ (జిల్లా జైలు) ఆస్పత్రిలో ఫార్మాసిస్టు (గ్రేడ్‌–2) పోస్టు, మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎంఎన్‌వో) పోస్టు, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ (ఎఫ్‌ఎన్‌వో) పోస్టును ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో జిల్లా, జనరల్‌ ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో పిడియాట్రిషియన్‌ పోస్టు, గైనకాలజిస్టు 2 పోస్టులు, మెడికల్‌ ఆఫీసర్లు 22 పోస్టులు, డెంటల్‌ హైజనిస్టు 9 పోస్టులు, డెంటల్‌ టెక్నీషియన్‌ ఒక పోస్టు, క్లినికల్‌ సైకాలజిస్టు పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులు ఏప్రిల్‌ 6 సాయంత్రం 5 గంటల్లోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో దరకాస్తులు అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు ‘శ్రీకాకుళం.ఏపీ.జీఓవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

భార్యపై భర్త దాడి

కొత్తూరు: భార్యపై భర్త దాడి చేసినట్టు ఫిర్యాదు అందిందని ఎస్సై ఎం.గోవింద బుధవారం తెలిపారు. మాకవరం గ్రామానికి చెందిన చీకటి కాంచనదేవి, నాయుడు దంపతులు. 12 ఏళ్లుగా తన భర్త నాయుడు మద్యం తాగి వచ్చి శారీరంగా హింసిస్తున్నాడని కాంచనదేవి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 28 తేదీన కూడా మద్యం తాగివచ్చి కొట్టి తోసేయడంతో పక్కన ఉన్న బైక్‌పై పడిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పకడ్బందీగా టెన్త్‌ పరీక్షల నిర్వహణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు.కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీకే్‌ష్‌ బి.లాఠకర్‌, డీఈఓ పగడలమ్మ, సహాయ కమిషనర్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు