మా ఊరి దేవుడు.. కోదండ రాముడు

31 Mar, 2023 02:24 IST|Sakshi
ఆలయం

● శ్రీకాకుళంలో 200 ఏళ్ల నాటి రామాలయం

● పాలరాతి విగ్రహాలే ప్రత్యేకత

● నేడు సీతారాముల కల్యాణం

లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి తరణి ప్రసాద్‌ మిశ్రా శ్రీరామనవమి సందర్భంగా బుధవారం వంశధార నదీతీరంలో ఇసుకతో ‘జైశ్రీరామ్‌’ సైకత శిల్పం రూపొందించారు. అద్భుత కళా నైపుణ్యంతో ఉన్న సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. – ఎల్‌.ఎన్‌.పేట

శ్రీకాకుళం కల్చరల్‌: రామనవమి ఉత్సవాలకు శ్రీరాముని ఆలయాలు సిద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు వందల ఏళ్లుగా కోదండ రామాలయం ఈ పుణ్యక్రతువును ఏటా నిర్వహిస్తోంది. పట్టణం నడిబొడ్డున పాలకొండ రోడ్డులోని కోదండ రామాలయం 1826లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలోని విగ్రహాలకు ఓ ప్రత్యేకత ఉంది. అన్ని ఆలయాల్లో దేవుని విగ్రహాలు దాదాపు నల్లరాతితో తయారు చేసినవే ఉంటాయి. కానీ ఇక్కడి సీతారామ,లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలు పాలరాతితో తయారు చేసినవి. వీటిని అయోధ్య నుంచి నాటుబళ్లపై శ్రీకాకుళం వరకు తీసుకువచ్చి ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది.

జీయరు స్వామి రాక..

ఈ ఆలయంలో 1962లో శ్రీరామరామానుజ జీయరు స్వామి రామ స్థూపం ఏర్పాటు చేశారు. అందులో రామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేశారు.

అలాగే సంక్షేమ రామాయణాన్ని పలకల మీద రాయించి పెట్టించారు. సీతారామలక్ష్మ, ఆంజనేయ సమేత మూర్తులను కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 108 ప్రదేశాల్లో స్థూపాలను జీయరు స్వామి ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన స్థూపం ఇరవై ఏడవది.

కార్యక్రమాలివే..

కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఈనెల 30నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరుగనున్నాయి. 30న స్వామివారి కల్యాణం, రావాడ రామారావు బృందం శ్రీసీతారామ సంగీత విభావరి జరుగుతుందని ఆలయ అర్చకులు శేషాచార్యులు, ఈఓ గురునాథరావు తెలిపారు. ఏప్రిల్‌ 1న స్వామివారి తిరువీధి, కల్యాణం, 3న రథోత్సవం, 4న ధూపోత్సవం, 5న స్వామివారి కల్యాణం, శ్రీరామచంద్ర ప్రభువుకు పట్టాభిషేకం, ధమనోత్సవం, దర్బార్‌ (ఆస్థానోత్సవం), 6న పాలికోద్వాసన, పుష్పయాగం, ద్వాదశ తిరువారాధన జరుగుతుందని తెలిపారు. ఇక్కడ నిత్య కై ంకర్యాలతో పూజలు చేస్తున్నామని అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు