నేరాలను నియంత్రించండి

31 Mar, 2023 02:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాధిక

పోలీసు అధికారుల సమీక్షలో ఎస్పీ జి.ఆర్‌.రాధిక

శ్రీకాకుళం క్రైమ్‌ : గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, ఆస్తి నేరాలను నియంత్రించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని, తరచూ రవాణాకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టాలని, ఉపయోగించే వాహనాలను సీజ్‌ చేసి వ్యక్తులను అరెస్టు చేయాలన్నారు. వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆస్తి నేరాలు జరగకుండా ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాత్రి, పగలు గస్తీ పెంచాలన్నారు. పాత కేసులో నేరస్థులపై నిఘా పెట్టాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కొత్త, అనుమానిత వ్యక్తుల గురించి ఆరా తీయాలన్నారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో జాతీయ రహదారి పొడవునా తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌, వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. అతివేగంగా వాహనాలను నడిపేవారిని గుర్తించి రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు, ఎస్‌బీ డీఎస్పీ ఎస్‌.బాలరాజు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు