పోరాట యోధుడు లక్ష్మణ నాయక్‌

31 Mar, 2023 02:24 IST|Sakshi
జయపురం: విజేత బాలికకు బహుమతి అందిస్తున్న అతిథులు
● రాష్ట్రవ్యాప్తంగా సహీద్‌ దివస్‌ ● నివాళులర్పించిన నాయకులు, అధికారులు

జయపురం: ఆదివాసీ ప్రజలను చైతన్య పరిచి, దేశ స్వాతంత్య్ర పోరాటం వైపు నడిపించిన పోరాట యోధుడు సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం లక్ష్మణ నాయక్‌ సంస్మరణ దినం సందర్భంగా జయపురం గుప్తేశ్వర కాంప్లెక్స్‌ ప్రాంగణంలోని విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. సమితి అధ్యక్షుడు మదన మోహణ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్ష్మణ నాయక్‌ జన్మ గ్రామాన్ని పాలకులు విస్మరించారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా, నేటికీ ఆ గ్రామానికి పక్కా రహదారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ వినోద్‌ మహాపాత్రొ, కాంగ్రెస్‌ నాయకులు వీరేన్‌ పట్నాయక్‌ తదితరులు ప్రసంగించారు. అలాగే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ దేవధర ప్రధాన్‌, మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయక్‌, డీపీఆర్‌ఓ యశోద గదబ, సమితి ఉపాధ్యక్షుడు బాలా రాయ్‌, గౌరవ పాత్రొ, సాధారణ కార్యదర్శి మాదవ చౌధురి, సహాయ కార్యదర్శి వెంకట్రావు పట్నాయక్‌, ప్రధాన ఆర్గనైజర్‌ హరీష్‌ ముదులి తదితరులు పాల్గొన్నారు.

బరంపురం: సహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ మరో అల్లూరి సీతారామరాజు అని బరంపురం ఎమ్మెల్యే విక్రమ్‌కుమార్‌ పండా అభిప్రాయం వ్యక్తంచేశారు. బరంపురం సర్కిల్‌ జైల్‌ ప్రాంగణంలో సహీద్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే తోపాటు నగర మేయర్‌ సంఘమిత్ర దొళాయి పూలమాల వేసి, నివాళులర్పించారు. జైలులో లక్ష్మణ్‌ నాయక్‌ను ఊరి తీసిన ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ దేశం బ్రిటీష్‌ పాలనలో ఉన్న సమయంలో ఆంగ్లేయులకు సింహ స్వప్నంగా నిలిచారని కొనియాడారు. మత్తిలి పోలీస్‌ స్టేషన్‌పై 5వేల మంది ఆదివాసీలతో కలిసి దాడిచేసి, మువ్వన్నెల పతకాన్ని ఎగుర వేసిన దేశభక్తుడని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్కిల్‌ జైలు సూపరింటెండెంట్‌ రఘునాథ్‌ మాఝి, జైలర్‌ ఆశిష్‌కుమార్‌ సాహు, డీపీఆర్‌ బిరంచి నారాయణ్‌, బీడీఏ సుభాష్‌ మహరాణ తదితరులు పాల్గొన్నారు.

రాయగడ: ఆదివాసీ నాయకుడు, ఒడిశా వరపుత్రుడు సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌కు జిల్లా యంత్రాంగం ఘన నివాళులర్పించింది. స్థానిక రైతు కాలనీ కూడలోని విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ మహేష్‌ పట్నాయక్‌, ఏడీఎం ధర్మానంద బెహరా, డీపీఆర్‌ఓ బసంతకుమార్‌ ప్రధాన్‌ పాల్గొన్నారు.

మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల ప్రాంగణంలో ఉన్న లక్ష్మణ్‌ నాయక్‌ విగ్రహానికి కలెక్టర్‌ విశాల్‌సింగ్‌ పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. నాయక్‌ పోరాటాలను గుర్తు చేసుకొని, అన్యాయాన్ని ఎదిరించడంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌ఓ ప్రమిలా మాఝి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు