రామతీర్థంలో కల్యాణశోభ

31 Mar, 2023 02:24 IST|Sakshi
సిద్ధమైన కల్యాణ వేదిక (ఇన్‌సెట్లో) సీతారామచంద్రమూర్తి ఉత్సవమూర్తులు

నెల్లిమర్ల రూరల్‌: శ్రీరామనవమి వేడుకులకు రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానం ముస్తాబైంది. స్వామివారి కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు కల్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించారు. తలంబ్రాల కార్యక్రమానికి మంచి ముత్యాలతో పాటు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధంచేశారు. సుమారు 25వేల మంది భక్తులు కూర్చొని కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు తదితర సౌకర్యాలను ఆలయ అధికారులు కల్పించారు. ఎండ తీవ్రత నేపధ్యంలో వీఐపీలు, భక్తులకు ఎయిర్‌ కూలర్లను ఏర్పాటు చేశారు. సింహాచలం దేవస్థానం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలు, తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు సమర్పించనున్నారు.

నేటి పూజా కార్యక్రమాలు ఇలా...

ఉదయం 3 గంటలకు స్వామివారికి ఆరాధన, బాలభోగం, తీర్థగోష్ఠిని నిర్వహిస్తారు. 6 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, 6.30 గంటలకు శ్రీరామచంద్ర ప్రభువు అవతారసర్గ విన్నపం, 7 గంటలకు తేనె, నెయ్యి, ఫలరసాలు, సముద్ర నదీ జలాలతో అష్టకలశ స్నపన మహోత్సవం (అభిషేకం) కార్యక్రమాలను అర్చకులు జరిపిస్తారు. 10.30 గంటల నుంచి స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ప్రత్యేకపూజలు అనంతరం సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను దేవాలయం నుంచి కల్యాణ మండపం వ ద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి విశేష అభిషేకాలు జరిపించి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తామని అర్చకులు తెలిపారు.

రాములోరి కల్యాణానికి మండపేట బొండాలు

సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన కాజులూరి వెంకట అచ్యుత రామిరెడ్డి సమకూర్చిన కొబ్బరి బొండాలను సేవా సంఘం ప్రతినిధులు బుధవారం అర్చకులకు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి శ్రేష్టమైన బొండాలను సేకరించి వాటికి వాటర్‌ పెయింట్‌తో తిరునామాలు, శంఖు చక్రాలు, సీతారాముల పేర్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి రామతీర్థం చేరుకున్న పవిత్ర గోటి తలంబ్రాలను భక్తులు ప్రత్యేక ఊరేగింపు నడుమ స్వామికి సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, సేవా సంఘం ప్రతినిధులు గోవింద, విజయ్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడే సీతారాముల కల్యాణోత్సవం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

మరిన్ని వార్తలు