31న మన్యం బంద్‌

31 Mar, 2023 02:24 IST|Sakshi

గుమ్మలక్ష్మీపురం: గిరిజనేతరులైన బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దన్న డిమాండ్‌తో ఈ నెల 31న మన్యం బంద్‌ పాటిస్తున్నట్టు ఏపీ గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ, బిడ్డిక శంకరరావు, మండంగి సన్యాసిరావు, మండంగి భూషణరావు, కె.మల్లేశ్వరరావు, పాలక క్రాంతి కుమార్‌ తెలిపారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం గిరిజన సంఘం కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన గోడ పత్రికలను బుధవారం ఆవిష్కరించారు. గిరిజనుల శ్రేయస్సును కోరి నిర్వహించతలపెట్టిన బంద్‌కు వ్యాపారులు, మోటారు కార్మికులు, ప్రజలు సహకరించాలని కోరారు.

ఈదురు గాలుల బీభత్సం

సీతంపేట: సీతంపేట ఏజెన్సీ పూతికవలస పంచాయతీ పరిధిలోని నడిమిగూడ పరిసరాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో రెండు విద్యుత్‌ స్తంబాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జీడి, మామిడి, అరటి తోటలు నేలకొరిగాయి. పంటనష్టం జరగడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

సీతారాముల వర్ణచిత్రం

గరుగుబిల్లి: శ్రీరామనవమిని పురస్కరించుకుని గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన పల్లపరిశినాయుడు వేసిన సీతారాముల వర్ణచిత్రం భక్తులను ఆకర్షిస్తోంది. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనా, నఖచిత్రకారుడిగా గుర్తింపు పొందారు.

సంపూర్ణ హక్కులు

కల్పించేందుకే రీ సర్వే

పార్వతీపురం: సాగుచేసిన భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ అన్నారు. గరుగుబిల్లి మండలం కొంకడవరం పంచాయతీ, సీతారాంపురం గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వేను బుధవారం పరిశీలించారు. రైతులు అందజేసిన వినతులను స్వీకరించాలని, రైతులకు ఉండే అనుమానాలు, అపోహలను నివృత్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జేసీ ఒ.ఆనంద్‌, ఆర్డీఓ కె.హేమలత, తహసీల్దార్‌ రఫీజాన్‌ ఉన్నారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయస్థాయిలో రాణించాలి

విజయనగరం టౌన్‌: స్థానిక తోటపాలెంలో ఉన్న సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న సేనాపతి పల్లవి ఖేలో ఇండియా జూనియర్‌ ఉమెన్స్‌ నేషనల్‌ ర్యాంకింగ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ 2023లో 64 కిలోల విభాగంలో బంగారు పతకం, సీనియర్‌ విభాగంలో రజతపతకం సాధించింది. ఈ మే రకు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరా వు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ఆవరణలో పల్లవిని పుష్పగుచ్ఛంతో అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లవి అంతర్జాతీయ స్థాయిలో రాణించి మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవి.సాయిదేవమణి, ఎన్‌సీసీ అధికారిణి కెప్టెన్‌ ఎం.సత్యవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అభ్యంతరాలను తెలియజేయాలి

పార్వతీపురం: ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయసంస్థ ద్వారా సరఫరా చేయనున్న మూడు చక్రాల మోటార్‌ వాహనం కోసం అభ్యర్థులను జిల్లా కమిటీ ఎంపిక చేసింది. ఎంపిక చేసిన జాబితాను జిల్లా వెబ్‌సైట్‌ పార్వతీపురం మన్యం.ఏపీ.జీఓవీ.ఇన్‌ నందు పొందుపరిచామని, ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఏప్రిల్‌ 1వ తేదీ సాయంత్రం 5గంటల లోగా స్పందన విభాగంలో తెలియజేయాలని ఆశాఖ సహాయ సంచాలకుడు ఎం.కిరణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.

మరిన్ని వార్తలు