పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

31 Mar, 2023 02:24 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

పార్వతీపురం: పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌తో కలిసి కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అనంతరం పదోతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లాలో 210 పాఠశాలలకు చెందిన 10,714 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందులో 5,272 మంది బాలురు, 5442 మంది బాలికలు ఉన్నట్టు చెప్పారు. వీరితోపాటు 70 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరికి 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ ఓపెన్‌స్కూల్‌ పదోతరగతి పరీక్షలకు ఆరు కేంద్రాలు, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇందులో 751 మంది పదోతరగతి, 279 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షలు రాస్తారని తెలిపారు. పదోతరగతి పరీక్షల కోసం 650 మంది ఇన్విజిలేటర్లు, 12 మంది రూట్‌ ఆఫీసర్లు, ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామన్నారు. అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను విధిగా నడపాలని ప్రజారవాణా అధికారిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ ఎస్‌డీవీ రమణ, డీఎస్పీ ఎ.సుభాష్‌, డీఎంఅండ్‌హెచ్‌ఓ బి.జగన్నాథరావు, జిల్లా రవాణాశాఖాధికారి సి.మల్లికార్జున రెడ్డి, ప్రజా రవాణా అధికారి టీవీఎస్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

రెండు భైక్‌లు ఢీకొని ఇద్దరికి

తీవ్ర గాయాలు

జామి: మండలంలో తానవరం జంక్షన్‌ వద్ద రెండు భైక్‌లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. తానవరం గ్రామానికి చెందిన టి.నారాయణ బుధవారం రాత్రి జామి నుంచి తానవరం భైక్‌ పై వెళ్తున్న సమయంలో గంధవరం గ్రామానికి చెందిన జుత్తక పైడిరాజు ఎస్‌.కోట నుంచి గంధవరం వెళ్తుండగా తానవరం జంక్షన్‌ వద్ద రెండు భైక్‌లు ఢీకొని ఇద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు