సెంచూరియన్‌లో మంజార్‌–2023 ఉత్సవాలు

31 Mar, 2023 02:24 IST|Sakshi
యాత్రికుల బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ మిశ్రా, ఎమ్మెల్యే ప్రధాన్‌

పర్లాకిమిడి: ఆర్‌.సీతాపురం సెంచూరియన్‌ వర్సిటీ క్యాంపస్‌లో గత 2 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ మంజార్‌–2023 ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి ఆదిత్య, సన్‌ డిగ్రీ, గాయత్రీ, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, కార్మెల్‌ హయ్యర్‌ సెకండరీ కళాశాల(కల్లట, హిరమండలం), పర్లాకిమిడి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కృష్ణచంద్ర గజపతి కళాశాలల నుంచి సుమారు 60మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ సాంకేతిక, సాంకేతికేతర, ఆటలు, విద్య, సంస్కృతి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డీఎన్‌ రావు ప్రసంగించారు. పీజీపీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ దేవిప్రసాద్‌ శత్పతి, సెంచూరియన్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనితా పాత్రొ, డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ పాఢి, మంజార్‌ కన్వీనర్‌ డాక్టర్‌ సుశాంతకుమార్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

యాత్రికుల బస్సు ప్రారంభం

కొరాపుట్‌: ప్రభుత్వ సాయంతో వయోజనులు తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ మేరకు నవరంగ్‌పూర్‌లోని మిషన్‌శక్తి సమా వేశ మందిరం వద్ద బస్సులను కలెక్టర్‌ డాక్టర్‌ కమలోచన్‌ మిశ్రా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. నవరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే సదాశివ ప్రధాన్‌ ప్రారంభ పూజలు చేసారు. ఈ బస్సులు రాయగడ జిల్లాకు చేరుకుని అక్క డ నుంచి రైలులో వెల్లూర్‌, తిరుపతి, శ్రీకాళహస్తి తదితర ప్రముఖ క్షేత్రాల్లో పర్యటించి, ఏప్రిల్‌ 2న తిరిగి వస్తారు. వీరి ఏర్పాట్ల కోసం ఆరుగురు అధికారులు వెంటే ఉంటారు. యాత్రలో వెళ్లే వయోజనులకు ప్రభుత్వమే ఉచితంగా పూర్తి సౌకర్యాలు కల్పిస్తోంది.

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై కొరడా

కొరాపుట్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసులు కొరడా ఝులిపించారు. కొరాపుట్‌ జిల్లాలో ట్రాఫిక్‌ నియమాల అమలుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై బుధవారం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులపై రూ.4 లక్షల 11 వేలు జరిమానాగా వసూలు చేశారు. 392 మందిపై చలానా విధించారు. 47మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేశారు. 40 మందిపై ఎంవీ చట్టంతో కేసులు నమెదు చేశారు. తనిఖీలు ముమ్మరం చేస్తామని, ప్రతిఒక్కరూ విధిగా నిబంధలు పాటించాలని పోలీసు అధికారులు స్పష్టంచేశారు.

వీకే పాండ్యన్‌ సుడిగాలి పర్యటన

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల, చిత్రకొండ సమితిల్లో 5టీ కార్యదర్శి వీకే పాండ్యన్‌ బుధవారం పర్యటించారు. మత్తిలి, ఖొయిర్‌పుట్‌ సమితులలో మంగళవారం పర్యటించిన ఆయన.. చిత్రకొండ సమితి లోని బొడపొడ పంచాయతీలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ శిబిరంలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం గురుప్రియ వంతెన పరిశీలించి, అక్కడి నుంచి చిత్రకొండలో మిషన్‌శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేఫ్‌లో అల్పాహారం చేశారు. అనంతరం చిత్రకొండ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కొద్దిసేపు మాట్లా డారు. అలాగే మల్కన్‌గిరి కొండపై ఉన్న మల్లికేశ్వర ఆలయాన్ని సందర్శించి, అభివృద్ధి పనులపై అధకార్లతో చర్చించారు. మోటు పరిధిలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలసుకున్నారు. పరిశీలనలో ఆర్‌.వీనిల్‌కృష్ణ, కలెక్టర్‌ విశాల్‌సింగ్‌, అధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు