బరంపురం: డిగ్రీ.....

31 Mar, 2023 02:24 IST|Sakshi
గవర్నర్‌తో పట్టాలు పొందిన విద్యార్థులు

బరంపురం: డిగ్రీ పట్టాలు అందుకున్న వారంతా మిగతా వారికి ఆదర్శప్రాయులుగా నిలవాలని రాష్ట్ర గవర్నర్‌, విశ్వ విద్యాలయాల ఛాన్సలర్‌ గణేషీలాల్‌ ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో స్థిరిపడి, ఉత్తమ సేవలతో దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని సూచించారు. నగరంలోని బంజవిహార్‌లో బిజూ పట్నాయక్‌ ఆడిటోరియం ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన బరంపురం విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ వీసీ గీతాంజలి దాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ ఒడిశాకు, కళింగ చరిత్రకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అశోకుని పాలనలో భువనేశ్వర్‌ ధౌలి, గంజాం జావ్‌గడా కళింగ యుద్ధం, బౌద్ధ చారిత్రత్మకమైన గుర్తులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. అలాగే దేశంలో మొదటిసారిగా 1936లో ప్రత్యేక ఒడిశా రాష్ట్ర ప్రారంభమైందని గుర్తుచేశారు. ఈ ప్రాంతం సంస్కృతి, కవులు, కళా, నటక, సంగీత సాహిత్యాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందన్నారు. 1943లో రాష్ట్రంలో రవిన్స్‌సా, కళ్లికోట్‌, పల్లా మహరాజా కళాశాలు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు. తొలుత ఉత్కళ విశ్వవిద్యాలయం ప్రారంభం కాగా.. 1967లో స్థానిక ప్రముఖులు, ప్రజల డిమాండ్‌ మేరకు ఉపేంద్ర బంజవిహార్‌లో బరంపురం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రస్తుతం 139 కళాశాలల్లో..

తొలుత బరంపురం వర్సిటీ 5 కళాశాలకు అనుబంధంగా ఉండగా, ప్రస్తుతం యూనివర్సిటీ కేంద్రంగా సుమారు 139కళాశాలు విద్యా బోధన అందిస్తున్నట్లు గవర్నర్‌ ప్రకటించారు. బరంపురం వర్సిటీ ఎంతోమంది మేధావులు, కళాకారులు, రచయితలు, కవులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులను దేశానికి అందించడంతో పాటు విద్యా కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందిందని ప్రశంసించారు. ప్రస్తుతం డాక్టరేట్‌లు, డిగ్రీ పట్టాలు అందుకున్న మేధావులంతా మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచీకరణ యుగంలో ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడుతోందని, దీనికి అనుగుణంగా యువతీ, యువకులు ఉన్నత ప్రమాణాలతో సంసిద్ధం కావాలని సూచించారు. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ గీతాంజలీ దాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూజీసీ నిధులతో వర్సిటీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అనంతరం పలువురు పట్టభద్రులకు డిలీట్‌, డీఎస్‌ డిగ్రీ పట్టాలు ప్రధానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ పి.కౌంసిల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు