అనుమానాస్పదంగా మూడో కపోతం

31 Mar, 2023 02:24 IST|Sakshi
పావురాన్ని పరిశీలిస్తున్న పోలీసు సిబ్బంది

భువనేశ్వర్‌: భద్రక్‌ జిల్లా బాసుదేవ్‌పూర్‌ మండలం బలిమెదొ గ్రామంలో మరో అనుమానాస్పద పావురం చిక్కింది. దీని కాలికి రెండు ప్లాస్టిక్‌ రింగులు తగిలినట్లు గుర్తించారు. స్థానికులు ఈ పావురాన్ని బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. గూఢచర్య కార్యకలాపాల కోసం దీనిని ప్రయోగిస్తున్నట్లు సర్వత్రా అనుమానం వ్యక్తమవుతోంది. బలిమెదొ గ్రామం ఎంఈ పాఠశాల సమీపంలో మంగళవారం సాయంత్రం పెనుగాలులు వీచిన సమయంలో సుశీల్‌ మహంతి అనే వ్యక్తి ఇంటిముందు పావురం తిరుగాడుతూ కనిపించింది. ఈ నేపథ్యంలో కపోతాన్ని పట్టుకొని పరిశీలించగా కాళ్లకు రెండు ప్లాస్టిక్‌ రింగులు ఉన్నట్లు గమనించారు. ఎడమ కాలిపై దిక్‌ఖాన్‌ యాదవ్‌ అని రాసి, నంబర్‌ కూడా ఉంది. కుడి కాలికి జోడించిన రింగుపై ఒక సంఖ్య, పక్షి గుర్తున్నట్లు గుర్తించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, అనంతరం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఘటనా స్థలంలో ధామ్రా ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. రాష్ట్రంలో ఇదే నెలలో ఇది మూడో ఘటన. ఈనెల 6న జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా పారాదీప్‌ తీరంలో ఫిషింగ్‌ బోటులో పావురం పట్టుబడగా, 15న పూరీ జిల్లా అస్తరంగ్‌ మండలం నాస్‌పూర్‌ గ్రామంలో కాళ్లకు ఇత్తడి, ప్లాస్టిక్‌ రింగులతో ట్యాగ్‌లు అమర్చిన మరో పావురం పట్టుబడింది. పారాదీప్‌ తీరంలో తొలుత పట్టుబడిన పావురం కాళ్లకు కెమెరా, మైక్రోచిప్‌ వంటి పరికరాలను అమర్చినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు