శ్రీకాకుళం: ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య.. సినీ ఫక్కీలో అరెస్ట్‌

25 May, 2023 08:08 IST|Sakshi

శ్రీకాకుళం: వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకే గ్రామం, ఒకే విధులు కావడంతో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. వారి మధ్యతలెత్తిన ఆర్థిక విబేధాలతో స్నేహితురాలే నమ్మించి పథకం ప్రకారం తన ప్రియుడితో కలిసి స్నేహితురాలిని హతమార్చింది. ఎల్‌.కోట మండలం కళ్లేపల్లి గ్రామంలో వైఎస్సార్‌ క్రాతిపథంలో బుక్‌ కీపర్‌గా పని చేస్తున్న గోకేడ మహేశ్వరి హత్యకేసును పోలీస్‌లు ఛేదించారు. నిందితులను కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్‌ విధించారు. ఎల్‌.కోట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు వెల్లడించారు.

కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ మహేశ్వరి, గాడి చిన్నతల్లిలు వైఎస్సార్‌ క్రాంతి పథంలో బుక్‌ కీపర్లుగా పనిచేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం కావడంతో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలు సాగాయి. ఈ క్రమంలో నిందితురాలు గాడి చిన్నతల్లి సీ్త్రనిధి రుణాల్లోని కొంత సొమ్మును తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంది. రుణం డబ్బులు బ్యాంకుకు కట్టే సమయంలో తన స్నేహితురాలు, మృతురాలు మహేశ్వరి వద్ద అప్పుగా తీసుకొని అప్పుడప్పుడు బ్యాంకులో జమ చేసేది. తర్వాత కాలంలో మహిళా మండలి సభ్యుల నిధులను వీరిద్దరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. ఎన్నాళ్లు ఇలా చేస్తాం... నీవు వాడుకున్న డబ్బులు, నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తీసుకు రా.. నేను వాడుకున్న డబ్బులను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బ్యాంకు రుణాలను చెల్లించి హాయిగా ఉందామని చిన్నతల్లికి మృతురాలు మహేశ్వరి సూచించింది. దీంతో మహేశ్వరిని చంపేస్తే అప్పుగా తీసుకున్న డబ్బులతో పాటు నేత్రనిధి రుణాలు కట్టాల్సిన అవసరం లేదని చిన్నతల్లి హత్య పథకం రచించింది.

రేగ గ్రామానికి చెందిన తన ప్రియుడు డెంకాడ వాసుకు పథకాన్ని వివరించింది. ఇద్దరూ కలిసి ఈ నెల 17వ తేదీన మహేశ్వరిని కారులో ఎక్కించుకుని విజయగనరం మహిళా ప్రాంగణంలో సమావేశానికి బయలుదేరారు. జామి మండలం అలమండ సంత సమీపంలో టిఫిన్‌ చేశారు. అక్కడ నుంచి భీమసింగి బ్రిడ్జి కిందకు కారును తీసుకెళ్లి ఆపారు. అక్కడ కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరితో మాటలు కలిపి ఆమె చున్నీనే పీకకు బిగించి కారులోనే హతమార్చారు. అక్కడ నుంచి నిందితురాలు చిన్నతల్లి ఏమీ తెలియనట్టుగా విజయనగరం సమావేశానికి వెళ్లిపోగా, మృతదేహాన్ని కారులోనే పెట్టుకొని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలోని సరస్వతీ లేవుట్‌ వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో తుప్పల్లో పడేసి డెంకాడ వాసు తన ఇంటికి వెళ్లిపోయాడు.

మృతదేహం 18వ తేదీన ఉదయం వెలుగు చూసింది. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోన్‌ లోకేషన్స్‌, చిన్నతల్లి నడవడికపై నిఘా పెట్టగా చిన్నతల్లి, ఆమె ప్రియుడు డెంకాడ వాసు, మరో ప్రియుడు కోరాడ సాయికుమార్‌తో కలిసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు బుధవారం సిద్ధమైంది. అయితే సినీ ఫక్కీలో పోలీసులు వాళ్లను చేజ్‌ చేశారు.  లక్కవరపుకోట మండలం గంగుబూడి కూడలి వద్ద ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. నిందితులు ముగ్గురినీ కొత్తవలస జూనియర్‌ సివిల్‌ జడ్జిముందు హాజరుపర్చగా రిమాండ్‌ విధించినట్టు డీఎస్పీ తెలిపారు.

దృశ్యం సినిమాను తలిపించిన కేసు..
మహేశ్వరి హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులకు దృశ్యం సినిమా తలపించింది. నిందితురా లు గాడి చిన్నతల్లి తన స్నేహితురాలు మహేశ్వరి ఫోన్‌ను మాయం చేయడంతో పాటు లోకేషన్‌ దొరకుండా జాగ్రత్తలు పడింది. తన ప్రియడు డెంకాడ వాసుతో కలిసి హత్యచేసి, మరో ప్రియు డు, కళ్లేపల్లికి చెందిన సాయికుమార్‌తో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించింది.

ఆమెతో పాటు ఇద్దరు ప్రియుల ఫోన్‌లను వారివారి ఇళ్ల వద్దనే ఉంచేసి.. ఎవరికి ఎవరూ ఫోన్‌లు చేయకుండా గడిపారు. ఎప్పటివలే విజయనగరం సమావేశానికి చిన్నతల్లి హాజరుకావడం అంతా డ్రామాను తలపించింది. పోలీసులు సవాల్‌గా తీసుకుని కేసును దర్యాప్తు చేయడంతో నిందితు లు పట్టుబడ్డారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చి న ఎల్‌.కోట, వేపాడ ఎస్‌ఐలు ముకుందరావు, రాజేష్‌, కానిస్టేబుల్స్‌ ఎం.రమేష్‌, పోతురాజు, గౌరినాయుడులను డీఎస్పీ గోవిందరావు అభినందించారు.

మరిన్ని వార్తలు