కరోనా ఇంజెక్షన్ల కలకలం

27 Sep, 2020 10:46 IST|Sakshi

భువనేశ్వర్‌ : రాష్ట్రంలో కరోనా ఇంజెక్షన్ల తయారీ కలకలం రేపింది.   బర్‌గడ్‌ జిల్లా భెడేన్‌ సమితిలోని రుసుడా గ్రామంలో కరోనా మందులు తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆ మందుల తయారీ శిబిరంపై సంబల్‌పూర్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, పోలీసులు ఉమ్మడిగా దాడులు ఆకస్మికంగా చేపట్టారు. ఈ శిబిరంలో మందుల తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచ ప్రజానీకాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సకు ఇంజక్షన్‌ ఆవిష్కరించినట్లు రుసుడా గ్రామానికి చెదిన ప్రహ్లాద్‌ బిసి (32) అధికారులకు తెలపడంతో ఆయన వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. (చదవండి : ఉమా భారతికి కరోనా పాజిటివ్‌)

రెండు రకాలుగా ఇంజెక్షన్లు  
ఈ వ్యవహారంపట్ల  ప్రహ్లాద్‌ బిసి స్పందించి కరోనా మహమ్మారి ప్రాణాల్ని బలిగొంటున్న తరుణంలో తాను ఈ ఇంజెక్షన్లు ఆవిష్కరించానని, ఇవి 2 రకాలుగా ఉంటాయని తెలిపాడు. ఒకటి ఎరుపు, రెండోది నీలం రంగులో ఉంటుందని చెప్పాడు. కోవిడ్‌–19 పాజిటివ్‌ ఖరారైతే ఒక ఇంజెక్షన్,  మరో 2 గంటల తర్వాత మరో రంగు ఇంజెక్షన్‌ ఇస్తానని, ఇలా ఇచ్చిన 8 గంటల తర్వాత రోగి పూర్తిగా కోలుకుంటాడని తెలిపాడు. ఇతరులకు కరోనా సంక్రమించకుండా ఈ ఇంజెక్షన్లు దోహదపడతాయని వివరించాడు.

ఈ ఇంజెక్షన్ల ఆవిష్కరణ, ప్రయోగం, వినియోగానికి సంబంధించి స్థానిక డ్రగ్‌ ఇన్‌స్పెక్టరు, రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అభ్యర్థించినట్లు ప్రహ్లాద్‌ బిసి తెలిపాడు.  కరోనా చికిత్సకు ఈ మందు చక్కగా పని చేస్తుంది. ఈ ఇంజెక్షన్‌ 100 శాతం విజయవంతమైన ఔషధంగా పేర్కొన్నాడు. దీని ప్రయోగం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో ఆయన అభ్యర్థన పట్ల స్పందించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు  ప్రభుత్వ అధికారులు గ్రామానికి వచ్చి మందుల తయారీని పర్యవేక్షించారు. భువనేశ్వర్‌ ప్రయోగ శాలకు పరీక్షల కోసం నమూనాల్ని సిఫారసు చేశారు. 

ఏ శిక్షకైనా సిద్ధం

ఈ మందు నకిలీ కాదు. కరోనా రోగుల ప్రాణాల్ని రక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకాన్ని కలవరపరుస్తున్న కరోనా రోగులకు ఉన్నత చికిత్స అందజేస్తుందని ప్రహ్లాద్‌ బిసి తెలిపాడు. మందు నకిలీ లేదా హానికరం అని తేలితే ఎటువంటి శిక్షనైనా అనుభవించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయనట్లు ప్రహ్లాద్‌ బిసి స్పష్టం చేశాడు.  

మరిన్ని వార్తలు