యాస్‌, కరోనాను సమర్ధంగా ఎదుర్కొంటాం: సీఎం

25 May, 2021 08:46 IST|Sakshi

జంట మాస్క్‌లు ధరించండి

జంట విపత్తులు ఎదుర్కొందాం

ప్రజలంతా సహకరించాలి

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విజ్ఞప్తి

భువనేశ్వర్‌: నాలుగున్నర కోట్ల రాష్ట్ర జనాభా ప్రాణరక్షణ ప్రభుత్వం బాధ్యత. కరోనా, యాస్‌ తుపాను రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. మొదటి నుంచి వేధిస్తున్న కరోనా నివారణ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా యాస్‌ తుపాను విపత్తు నుంచి గట్టెక్కాలి. తుపాను ప్రాణహాని నివారణ కోసం లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు కోసం ప్రజలంతా విధిగా రెండు మాస్క్‌లు ధరించాలి. కరోనా నిర్వహణలో తలమునకలై ఉన్న ప్రభుత్వ యంత్రాంగానికి యాస్‌ తుపాను నిర్వహణ మరింత భారం కానుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యకలాపాల్లో అధికారులకు సహకరించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం యాస్‌ తుపాను నిర్వహణకు రాష్ట్ర ప్రజల నుద్దేశించి వీడియో సందేశం జారీ చేశారు.

సమర్థంగా గత తుపానుల ఎదుర్కొన్నాం
తుపాను విపత్తు నిర్వహణలో భాగంగా ప్రజలకు మాసు్కల పంపిణీలో పౌర సమాజం, పంచాయతీ రాజ్‌ వ్యవస్థ, మిషన్‌ శక్తి విభాగం సహకరిస్తాయి. సమష్టి భాగస్వామ్యంతో లోగడ అంఫన్‌ వంటి భయానక తుపానులను సమర్ధంగా ఎదుర్కొన్న సందర్భాల్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తుపాను తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు ముఖానికి రెండు మాసు్కలు ధరించడం అలవరుచుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా తాండవంతో అల్లాడుతున్న విపత్కర పరిస్థితుల్లో మరో భారీ విపత్తు యాస్‌ తుపాను దూసుకు వస్తోంది.

ఈ జంట విపత్తుల నుంచి సురక్షితంగా బయట పడేందుకు ప్రభుత్వ కార్యాచరణకు ప్రజలంతా పూర్తిగా సహకరించాలి. తుపాను సందర్భంగా నిర్వహించే తరలింపు కార్యకలాపాలకు  ప్రజలు పూర్తిగా సహకరించాలి. తుపాను విపత్తు నిర్వహణ రాష్ట్రానికి కొత్తేమీ కాకున్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే భారీ నష్టం సంభవించే  ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అంతా ఉమ్మడిగా అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు.   

Read latest Orissa News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు