చెరువుకు స్వేచ్ఛ

25 Feb, 2023 08:58 IST|Sakshi
యడ్లపాడు మండలంలోని కారుచోల గ్రామ చెరువు వ్యూ

చెరువులను కాపాడాలని లోకాయుక్తకు వెళ్లిన న్యాయవాది కోటేశ్వరరావు

6 చెరువుల పరిధిలో 110.8 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు గుర్తించిన అధికారులు

కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడి, పునరుద్ధరణ చేయాలని ఆదేశించిన లోకాయుక్త

జలజీవన్‌ మిషన్‌లో భాగంగా చెరువులను అభివృద్ధి చేయనున్న డ్వామా అధికారులు

ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

సాక్షి, నరసరావుపేట: కొన్ని చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకోవడం రూపురేఖలు కోల్పోవడం జరుగుతోంది. చెరువులకు నీరు సరఫరా చేసే వరద కాలువలను సైతం అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించుకొని తమ పొలాల్లో కలుపుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు సైతం చెరువులు పూర్తి స్థాయిలో నిండటం లేదు. ఇలా చెరువులు ఆక్రమణలకు గురికావడంతో చెరువుల విస్తీర్ణం కుంచించుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు, చెరువులపై ఆధారపడిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన సామాజికవేత్త, న్యాయవాది అయిన పచ్చల కోటేశ్వరరావు లోకాయుక్తకు 2016 సంవత్సరంలో ఫిర్యాదు చేశారు.

ప్రస్తుత పల్నాడు జిల్లా పరిధిలోని ఆరు చెరువులను గట్టుపక్కనే ఉండే రైతులు ఆక్రమించి, వాటి పరిధిని తగ్గిస్తున్నారని అందులో పేర్కొన్నారు. సాగునీటి వనరు కోసం కేటాయించిన భారీ చెరువులు క్రమేణ తగ్గిపోతున్నాయని, భవిష్యత్‌ నీటి అవసరాల కోసం వాటిని సంరక్షించాలంటూ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త పలుమార్లు విచారణ జరిపి ఆక్రమణకు గురైన చెరువులను సంరక్షించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా మైనర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. సర్వే నిర్వహించి ఆక్రమణలు ఎంతమేరకు జరిగాయో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది.

ఆక్రమణల గుర్తింపు..

లోకాయుక్త ఆదేశాల మేరకు మైనర్‌ ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖలు చెరువు భూముల ఆక్రమణలను సర్వే ద్వారా గుర్తించారు. చెరువులు ఆక్రమణలకు గురైన వాటిలో యడ్లపాడు మండలంలోని మైదవోలు, కారుచోల, యడ్లపాడు, నాదెండ్ల మండలంలోని గొరిజవోలు, నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, నకరికల్లు మండలంలోని కంకలగుంట్ల చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 110.8 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్టు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు చెరువు భూముల ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. కబ్జాకు గురైన పలు చెరువుల భూములకు విముక్తి కలిగిస్తున్నామని పంచాయతీరాజ్‌, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖలు లోకాయుక్తకు నివేదిక సమర్పించాయి. 2023 ఫిబ్రవరి 21న లోకాయుక్త సదరు భూముల్ని స్వాధీనం చేసుకుని ఆయా భూములకు పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జలశక్తి అభియాన్‌ ద్వారా పనులు..

ఆక్రమణలకు గురైన చెరువులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పునరుద్ధరించి సమీపంలోని రైతుల పొలాలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కొన్నింటిలో జలశక్తి అభియాన్‌న పథకం ద్వారా నీటి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టామని చైర్మన్‌న జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డికి అధికారులు నివేదిక సమర్పించారు. రానున్న రెండు నెలల్లో చెరువుల హద్దులను గుర్తించి, చుట్టూ కందకాలను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్‌న అధికారులు తెలిపారు. జలజీవన్‌న మిషన్‌లో భాగంగా ఆయా చెరువుల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అన్యాక్రాంతమైన చెరువు భూములను తిరిగి వెనక్కి తెస్తుండటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో సాగునీటికి ఢోకా లేదంటున్నారు.

చెరువుల చుట్టూ కందకాలు తవ్వుతాం

చెరువుల సంరక్షణకు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తిస్తే ఉపాధి హామీ పథకం ద్వారా కందకాలు తవ్వుతాం. సరిహద్దుల చుట్టూ ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతాం. చెరువుల్లో వర్షపు నీరు చేరేలా జల సంరక్షణ పనులు కూడా చేపడతాం. జలశక్తి అభియాన్‌ ద్వారా పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.

– జోసఫ్‌కుమార్‌, డ్వామా పీడీ, పల్నాడు జిల్లా

ఆక్రమణలు తొలగించడం శుభపరిణామం

చెరువు భూములను ఆక్రమించడంతో నానాటికీ పరిధి తగ్గిపోతోంది. ఈ సమయంలో చెరువులను సర్వే చేసి చెరువు వాస్తవ పరిధిని గుర్తించి ఆక్రమణలు తొలగించి, రక్షణ చర్యలు తీసుకోవడం శుభపరిణామం. దీనివల్ల పూర్థిస్తాయిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతుంది.

– కె.వీరారెడ్డి, గొరిజవోలు, నాదెండ్ల మండలం

మరిన్ని వార్తలు