క్షయ నివారణకు సహకరించాలి

25 Mar, 2023 02:08 IST|Sakshi
● డీఆర్వో కె.వినాయకం ● పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ అవగాహన ర్యాలీ

నరసరావుపేట: క్షయ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం అందజేసే మందులు, పౌష్టికాహారం తీసుకొని వ్యాధి నివారణకు సహకరించాలని డీఆర్వో కె.వినాయకం, జిల్లా క్షయ, కుష్టు, ఎయిడ్స్‌ రోగ నివారణ జిల్లా అధికారి డాక్టర్‌ కె.పద్మావతి కోరారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పల్నాడు జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయం ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డు పాత ప్రభుత్వాసుపత్రి నుంచి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డీఆర్వో వినాయకం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి ప్రమాదకరమైనదైనా పూర్తి చికిత్స ఉందన్నారు. దీనికి కావాల్సిన మందులు, పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్‌టీపీసీఆర్‌, సీబీనాట్‌ మిషన్లు, డీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎవరికై నా సరే రెండు వారాల నుంచి దగ్గు, జలుబు, కళ్లెలో రక్తం పడటం, చాతీలో అసౌకర్యం, బరువు తగ్గటం వంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లి కళ్లె పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల ఆర్థిక సహాయం కింద రూ.500 అందజేస్తోందన్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత అభియాన్‌ ప్రోగ్రామ్‌ కింద జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 1234 మంది దాతలను గుర్తించి 1781 మంది టీబీ పేషెంట్లను దత్తత తీసుకొని ప్రతి నెలా వారికి నిక్షయ మిత్ర ప్రోగ్రామ్‌ ద్వారా 1200 మందికి ఫుడ్‌ బాస్కెట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. క్షయ వ్యాధి సోకిన వారెవరూ భయపడకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.శోభారాణి, ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు