ఉద్యోగం పేరిట దోపిడీ

26 Mar, 2023 02:06 IST|Sakshi
డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు దాడి

తెనాలిరూరల్‌: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని యువకులకు మాయ మాటలు చెప్పి ఓ మోసగాడు రూ. ఎనిమిది లక్షలు దండుకున్నాడు. రెండేళ్లవుతున్నా ఉద్యోగం ఊసే లేకపోవడంతో ప్రశ్నించిన యువకులపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన యువకులు బ్రహ్మరాజు, నాసరయ్యలు డిగ్రీ పూర్తి చేశారు. వలంటీర్లుగా పని చేసిన వీరికి బ్రహ్మరాజు బాబాయి ద్వారా గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన డి. నాగరాజు (ప్రస్తుతం తెనాలి చినరావూరులో నివాసం) పరిచయమయ్యాడు. తాను ఓ రాజ్యసభ సభ్యుడి పీఏనని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని యువకులకు నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన ఇద్దరూ చెరో రూ. నాలుగు లక్షల చొప్పున నాగరాజుకు 2021లో ఇచ్చారు. ఉద్యోగం సంగతి అడుగితే దాటేస్తూ వచ్చాడు. శనివారం సాయంత్రం తెనాలికి వచ్చిన బాధిత యువకులు తమకు డబ్బుతిరిగి ఇచ్చేయమని ఫొనులో కోరారు.

చినరావూరు రైల్వే స్టేషన్‌ శివారుకు వీరిని పిలిపించిన నాగరాజు, తననే డబ్బు అడుగుతారా అంటూ సుమారు 15 మంది యువకులను కర్రలు, కత్తులతో వెంటేసుకొచ్చి బాధిత యువకులపై దాడి చేశాడు. కర్ర తాకిడిని తృటిలో తప్పించుకున్న నాసరయ్య డయల్‌ 100, 108కు ఫోన్‌ చేయగా అంబులెన్సు రావడంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు