క్రీడాకారులకు ప్రోత్సాహం

27 Mar, 2023 01:46 IST|Sakshi
అట్ల శివనాగిరెడ్డిని సన్మానిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి

బాపట్ల: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులకు మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయని ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. అసోంలోని గౌహతిలో ఈ నెల 24న జరిగిన 4వ ఏషియన్‌ ఖోఖో టోర్నమెంట్‌లో బాపట్ల జిల్లా జె.పంగులూరు నుంచి అట్ల శివనాగిరెడ్డి పాల్గొని దేశం తరపున ఆడి బంగారు పతకం సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే కోన రఘుపతి శివనాగిరెడ్డిని సన్మానించారు. ఎమ్మెల్యే కోన మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గానికి చెందిన శివనాగిరెడ్డి ఏషియన్‌లో బంగారు పతకం సాధించడం గొప్ప విషయమన్నారు. శివనాగిరెడ్డికి ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఖోఖో క్రీడాకారులకు మంచి శిక్షణ ఇస్తున్న అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి సీతారామిరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వై.అశ్వనీరెడ్డి ఉన్నారు.

అంతర్జాతీయ ఖోఖో టోర్నీలో స్వర్ణం

జే.పంగులూరు: అసోంలోని గౌహతి తిమల్‌పుర స్టేడియంలో ఈ నెల 20 నుంచి 24 వరకు నిర్వహించిన అంతర్జాతీయ 4వ ఏషియన్‌ ఖోఖో పోటీల్లో భారత పురుషుల జట్టు బంగారు పతకం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పంగులూరు ఎస్‌ఆర్‌ఆర్‌ ఖోఖో అకాడమీ క్రీడాకారుడు అట్ల శివనాగిరెడ్డి పోటీల్లో పాల్గొని జట్టుకు బంగారు పతకం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. అసోం రాష్ట్రం నుంచి పంగులూరు వచ్చిన సందర్భంగా శివనాగిరెడ్డికి ఖోఖో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ ఎంఎస్‌ త్యాగి, మిట్టల్‌, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య, మాగుంట కళాశాల చైర్మన్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ శాప్‌ నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ చీప్‌ప్యాట్రన్‌ ఉగ్రనరసింహారెడ్డి, రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆదివారం అభినందించారు. సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌లో 16 దేశాలు పాల్గొన్నాయని తెలిపారు. భారత జట్టు మంచి ఆటతీరు కనబరిచి మొదటి స్థానం సాధించిందన్నారు. ఈ జట్టులో మన రాష్ట్ర క్రీడాకారుడు అట్ల శివనాగిరెడ్డి సత్తా చాటి దేశం గెలుపునకు దోహదపడ్డారని కొనియాడారు. అనంతరం క్రీడాకారుడు శివనాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడాకారునిగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని, దేశానికి బంగారు పతకం తీసుకురావడంలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, నడిపించిన గురువు సీతారామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఎమ్మెల్యే కోన రఘుపతి

మరిన్ని వార్తలు