ఎన్‌టీఆర్‌ పురస్కారం అందుకోవడం అదృష్టం

27 Mar, 2023 01:46 IST|Sakshi
రాజేంద్రప్రసాద్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న మాజీ మంత్రి రాజేంద్రప్రసాద్‌

తెనాలి టౌన్‌: ఎన్‌టీఆర్‌ పేరు మీదుగా చలన చిత్ర పురస్కారం అందుకోవడం జీవితంలో మరచిపోలేనిదని, తెనాలిలో తమకు అద్భుతమైన సన్మానం జరగడం తన అదృష్టమని ప్రముఖ సినీనటుడు, నట కిరీటి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నాజర్‌పేటలోని ఎన్‌వీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి శకపురుషుడు ఎన్‌టీఆర్‌ శత జయంతి మహోత్సవాల సభ నిర్వహించారు. సభకు సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్వాగతం పలుకగా, ప్రముఖ పాత్రికేయుడు యర్రాప్రగడ రామకృష్ణ సభా పరిచయం చేశారు. సభకు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు. సభలో ఎన్‌టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని నట కిరీటి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు ఎన్‌టీఆర్‌ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్‌, సినీ రచయిత సాయిమాధవ్‌, రాజేంద్రప్రసాద్‌ అందజేశారు. అనంతరం సభలో సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌ పుట్టిన నిమ్మకూరులోనే తాను కూడా జన్మించానని తెలిపారు. ఎన్‌టీఆర్‌ పోషించిన పాత్రలు సినీ రంగంలో ఎవరూ పోషించలేదని, ఆయనకు మించిన నటుడు ఎవరు లేరని కొనియాడారు. ఎన్‌టీఆర్‌ అవార్డు అందుకున్నందుకు పైలోకంలో ఉన్న ఆయన సంతోషపడతారని తెలిపారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు ఎన్‌టీఆర్‌ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని, వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ ప్రేక్షకులను కన్నీళ్లతో నవ్వించగలిగిన నటుడు రాజేంద్రప్రసాద్‌ అని, ఆయనకు ఎన్‌టీఆర్‌ అవార్డు ఇవ్వడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వపడేలా నవ్విస్తూ నవ్వుతూ ఉండే వ్యక్తి రాజేంద్రప్రసాద్‌ అని కొనియాడారు. తొలుతగా న్యాయవాది జగదీశ్వరాంబ జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదికపై ఎన్‌టీఆర్‌ విగ్రహానికి నాయకులు, ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో మహిళ కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, సినీ ఛాయాగ్రాహకులు ఎస్‌.గోపాల్‌రెడ్డి, సినీ రచయిత ఎం.ఎస్‌. శాస్త్రి, సినీ పాత్రికేయులు అంబటి సురేంద్రరాజు, యు.వినాయకరావు, ఎన్‌టీఆర్‌ కాస్టూమ్స్‌ టైలర్‌ వాలేశ్వరరావు, నందమూరి చిత్రశాల ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. తొలుతగా పెసర్లంక వసంత దుర్గ శిష్యబృందం కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చారు. కార్యక్రమాన్ని మహోత్సవాల కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌

మరిన్ని వార్తలు