హలీం వ్యాపారులు నిబంధనలు పాటించడం తప్పనిసరి

27 Mar, 2023 01:46 IST|Sakshi
హలీం వ్యాపారులు, ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్న ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌

కోవిడ్‌–19 దృష్ట్యా మాస్క్‌లు, శానిటైజర్లు వాడాలి

నగరంపాలెం: జిల్లాలోని హలీం వ్యాపారులు విధిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ముస్లిం పెద్దలు, సోదరులు, హలీం వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ హలీం దుకాణాల వద్ద వాహనాల నిలుపుదల, రాకపోకలతో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. దేశంలో కోవిడ్‌–19 కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. మాస్క్‌లు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. ప్రార్థన వేళల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా వాహన రాకపోకలు జరిగేలా పోలీస్‌ అధికారులు విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. సమావేశంలో తూర్పు డీఎస్పీ బి.సీతారామయ్య, పశ్చిమ ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు హైమారావు, ఎస్‌.వి.రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఎం.సుబ్బారావు, అక్కేశ్వరరావు, నిషార్‌ బాషా, సుబ్బారావు, ఎస్‌బీ సీఐ బి.నరసింహారావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు