భద్రత..భరోసా

27 Mar, 2023 01:46 IST|Sakshi
రొంపిచర్ల మండలం ఆలవాల గ్రామంలో ప్రజలతో ముచ్చటిస్తున్న సీఐ భక్తవత్సల రెడ్డి
ప్రజలతో మమేకం కావడం.. సమస్యలను ఆదిలోనే పరిష్కరించడం.. ప్రజల్లో పోలీసులంటే ఉన్న భయాన్ని తొలగించడం.. ఇదీ పల్నాడు జిల్లా పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం పల్లెనిద్ర ముఖ్య ఉద్దేశం. సమస్యాత్మక గ్రామాల్లో రాత్రిళ్లు బస చేయడం, ఉదయాన్నే ఆ ప్రాంతంలో పర్యటించడం వల్ల చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవడమే కాకుండా ప్రజల్లో సైతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
● వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పల్నాడు జిల్లా ఎస్పీ ● పల్లె నిద్ర పేరిట సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల సమావేశాలు ● ప్రజలతో మాటామంతీ, గ్రామాల్లోనే నిద్ర ● ఉదయం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి నడక ● శనివారం రాత్రి 34 గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతం ● గ్రామస్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపుతామంటున్న ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి

సాక్షి, నరసరావుపేట: పల్నాడు ప్రాంతం ప్రేమానురాగాలకు పుట్టినిల్లు. ఈ ప్రాంత ప్రజలకు ప్రేమ ఎంతుంటుందో పౌరుషం కూడా అంతే మోతాదులో ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్థలు, సమస్యలు సైతం పట్టింపులకు పోయి తీవ్ర నేరాల వరకు దారి తీస్తుంటాయి. వాటిని ఆదిలోనే అదుపు చేస్తేనే జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించిన పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘పల్లె నిద్ర’ పేరుతో పోలీసులు గ్రామ, వార్డు స్థాయిల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడే రాత్రి మకాం చేసి నిద్రపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభించారు. ఇక మీదట ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారాలు పల్లె నిద్ర కార్యక్రమం జరగనుంది. గత శనివారం పల్నాడు జిల్లాలోని 34 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. శనివారం రాత్రి పల్లె నిద్ర చేసి, ఆదివారం ఉదయం వీధుల్లో పోలీసులు నడక సాగించి ప్రజల వద్దకు వెళ్లారు. పల్లె నిద్ర కార్యక్రమం అమలును ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో పర్యటించి పర్యవేక్షించారు.

ప్రజలతో మమేకం...

పల్లె నిద్రలో భాగంగా పోలీసుల ఆయా స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక గ్రామాలను ఎంచుకుంటారు. ముందు రోజే ఆ గ్రామస్తులకు సమాచారం అందించి, సాయంత్రం 7 గంటలకు గ్రామ సచివాలయం లేదా మరేదైనా ప్రభుత్వ భవనాల వద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, సమస్యాత్మక వ్యక్తులు ఎవరు, ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో పోలీసులు గుర్తించి పక్కా సమాచారంతో గ్రామానికి వెళతారు. వాటిపై ప్రజలతో ముచ్చటిస్తారు. తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. భూ సమస్యలు, వివాహేతర సంబంధాలు వల్ల ఏర్పడే సమస్యలను వీలైనంత వరకు అక్కడే పరిష్కరించి నేరాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తారు. పోలీస్‌స్టేషన్‌ గుమ్మం తొక్కలేని చిన్న, చిన్న సమస్యలకు తగిన పరిష్కారం చూపుతారు.

రాత్రి బస.. ఉదయం నడక

పల్లె నిద్రలో భాగంగా ప్రజలతో మమేకమైన తర్వాత పోలీసు అధికారులు సమస్యాత్మక గ్రామాల్లోనే రాత్రి బస చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి గ్రామం, వార్డులోని వీధి వీధి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఆరోగ్యశాఖ వంటి వివిధ శాఖల సమస్యలను ప్రజలనుంచి తెలుసుకొని ఆయా శాఖలకు నివేదించి సమస్యలకు పరిష్కారం దక్కేలా ప్రయత్నిస్తారు. ప్రజలకు కనిపించేలా పోలీసు అధికారుల, సిబ్బంది ఫోన్‌ నెంబర్లు రాసి ప్రజలు ఫోన్‌ ద్వారా సమస్యలు తెలిపేలా ప్రోత్సహిస్తారు. పల్లె నిద్ర కార్యక్రమంలో మహిళా పోలీసులతో పాటు సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూస్తున్నారు.

పరిష్కార వేదిక.. ‘పల్లె నిద్ర’

ఆదిలోనే గుర్తించి పరిష్కరించేందుకే...

గ్రామాల్లో రెవెన్యూ, వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడే చిన్న చిన్న గొడవలే తర్వాత పెద్ద నేరాలకు దారితీసే అవకాశాలున్నాయి. వాటిని ఆదిలోనే గుర్తించి పరిష్కరిస్తే తీవ్ర నేరాలు జరిగే ఆస్కారం ఉండదు. ఆ ఉద్దేశంతోనే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తొలి వారం పల్లె నిద్ర విజయవంతంగా పూర్తయింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింతంగా ప్రజల్లోకి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీసుకువెళ్తాం.

– వై.రవిశంకర్‌ రెడ్డి,

పల్నాడు జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు