వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది

27 Mar, 2023 01:46 IST|Sakshi
● లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ ● ఘనంగా గుంటూరు వైద్యకళాశాల గ్రాడ్యుయేషన్‌ డే

గుంటూరుమెడికల్‌: మెడికల్‌ ప్రొఫెషన్‌ ఎవర్‌గ్రీన్‌ అని, ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తికి విలువ ఎన్నటికీ తగ్గదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ అన్నారు. వైద్యులు సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు వైద్య కళాశాల జింకానా ఆడిటోరియంలో వైద్య కళాశాల 2017 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని, వైద్యులు మానవత్వంతో, మంచి నైపుణ్యంతో సేవలందించాలని చెప్పారు. వైద్యులకు, సమాజానికి కొంత గ్యాప్‌ ఉందని, డాక్టర్‌పై నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలు మన దేశంలో వైద్యసేవలు పొందేందుకు వస్తున్నారని, మెడికల్‌ సర్వీసెస్‌ ద్వారా ప్రతి ఏడాది లక్షా పదివేల కోట్ల రూపాయల ఆదాయం దేశానికి వస్తుందని డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. ప్రతి ఏడాది దేశంలో యువ వైద్యులు హెల్త్‌ కేర్‌ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు జింకానా పేరుతో చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. దేశంలోనే అందరికీ జింకానా ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

హెల్త్‌ కేర్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో చేశారు..

గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చాగంటి పద్మావతి దేవి మాట్లాడుతూ గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో చేశారని చెప్పారు. వైద్య కళాశాలలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్స్‌తో పాటుగా పారామెడికల్‌ పోస్టులన్నీ భర్తీ చేయటమే గాకుండా అదనంగా పోస్టులు సైతం మంజూరు చేశారన్నారు. పీజీ సీట్లు పెరిగేందుకు నాడు–నేడు కింద నిధులు కేటాయించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లలో 60కి పైగా పీజీ సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్రప్రభుత్వం హెల్త్‌ కేర్‌కు చాలా సపోర్ట్‌ చేస్తుందని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి మాట్లాడుతూ తల్లిదండ్రుల డెడికేషన్‌తో పిల్లలు డాక్టర్లు అవుతున్నారని, వైద్యులు రోగులకు సేవ చేయాలన్నారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి, జీజీహెచ్‌ డెప్యూటీ సూపరింటెండెంట్స్‌ డాక్టర్‌ సంధ్యావళి, డాక్టర్‌ పద్మశ్రీ, సీటీఎస్‌ రిటైర్డ్స్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ రామకృష్ణారెడ్డి యువ వైద్యులుగా బయటకు వస్తున్న వారికి పలు సూచనలు చేశారు. డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ, వైద్య కళాశాల, జీజీహెచ్‌ అధికారుల చేతుల మీదుగా ఎంబీబీఎస్‌ డిగ్రీ పట్టాలను యువ వైద్యులు అందుకున్నారు. పలువురు వైద్యులు తమ తల్లిదండ్రులతో, తోటి వైద్యులతో కలిసి గ్రూప్‌ ఫొటోలు దిగారు.

మరిన్ని వార్తలు