పని మనుషులే నిందితులు

27 Mar, 2023 01:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ స్రవంతిరాయ్‌, ముసుగులో నిందితులు
● వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు ● రూ. 20 లక్షల సొత్తు స్వాధీనం

తెనాలిరూరల్‌: నమ్మకంగా ఉంటూ యజమాని ఇంటికే కన్నం వేసిన దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొంగలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టూ టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కె.స్రవంతిరాయ్‌ వివరాలు వెల్లడించారు. పట్టణ ఐతానగర్‌లోని లింగారావు సెంటరులో గల లింగారావు ఇంట్లో నన్నపనేని దుర్గాప్రసాద్‌, హేమలత దంపతులు నివసిస్తున్నారు. వృద్ధులైన వీరికి సహాయం చేసేందుకు రమావత్‌ చాందిని, రమావత్‌ కృష్ణలు సుమారు నాలుగేళ్ల క్రితం పనిలో చేరారు. వీరికి ఇంటి ఆవరణలోని షెడ్డులో ఆశ్రయం కల్పించి సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. హేమలత కుమారుడు పవన్‌కృష్ణ ఓ ఆలయ నిర్మాణానికి సహాయం చేసేందుకు కొద్ది నెలల క్రితం రూ. 5 లక్షలు తన తలిదండ్రుల వద్ద ఉంచాడు. ఆలయ నిర్వాహకులకు ఇచ్చేందుకు నగదు ఇవ్వమని తల్లిని కోరగా ఆమె బీరువాలో ఉంచిన నగదును తెచ్చి కుమారుడికి వచ్చింది. రూ 5 లక్షల్లో రూ. 40 వేలు తగ్గినట్టు గుర్తించిన పవన్‌కృష్ణ తలిదండ్రులను అడగ్గా వారు బీరువాను పరిశీలించారు. నగదు పక్కనే ఉంచిన రెండు బంగారు గాజులూ కనబడలేదు. దీంతో ఇంట్లోని మరో బీరువానూ పరిశీలించగా, అందులో ఉండాల్సిన సుమారు 400 గ్రాముల బంగారు ఆభరణాలు కనబడలేదు. బీరువాలకు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నా నగదు, నగలు ఎలా మాయం అయ్యాయన్న అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హేమలత ఇంట్లోకి పనిమనుషులు కాకుండా వేరే ఎవరికీ ప్రవేశం లేదు. దీంతో పోలీసులు పని మనుషులు చాందిని, కృష్ణలు చోరీకి పాల్పడి ఉంటారని భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. గోలిడొంక రోడ్డులో ఉండగా వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరం అంగీకరించారు. సీఐ ఎస్‌.వెంకటరావు, ఎస్‌ఐ నాగేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహారావు, కానిస్టేబుల్‌ సాంబశివరావు నిందితులు చెప్పిన దాని ప్రకారం రెండు బంగారు బిస్కెట్లు(ఒకొక్కటి 100 గ్రాములు), మూడు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వార్తలు