పల్నాడు

17 Nov, 2023 01:42 IST|Sakshi

చిలకలూరిపేట: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం చిలకలూరిపేటలో సాక్షాత్కారం కానుంది. మూడూ నామాల స్వామి కనుల పండువగా కొలువుదీరనున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపమూ నిర్మాణం జరుపుకోనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కృషి, దాతృత్వంతో ఈ పుణ్యకార్యం రూపుదాల్చనుంది. గతంలోనూ పలుమార్లు చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణమండపం, ఆలయ నిర్మాణానికి ఆలోచనలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టువదలకుండా మంత్రి విడదల రజిని కృషి చేశారు. ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

భూమి కేటాయింపు
తలచినదే తడువుగా చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించేందుకు అనువైన స్థలం కోసం మంత్రి విడదల రజిని అన్వేషణ సాగించారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం వద్ద బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరుపుకుంటున్న ప్రదేశానికి సమీపంలో భూమిని గుర్తించారు. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన దేవదాయశాఖ భూమి పురుషోత్తమపట్నం సర్వే నంబర్‌ 336/1–సీ, 336/3సీలో ఉన్న ఐదు ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిలో కల్యాణ మండపం, ఆలయం నిర్మించేందుకు అవసరమైన ఫైళ్లను వేగంగా ముందుకు తెచ్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న దేవదాయశాఖకు చెందిన ఈ భూమిని కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించేందుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.3.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం
తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాన్ని రూ.2.50 కోట్లతో, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.75 లక్షలతో నిర్మించేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఇందులో టీటీడీ నిబంధనల ప్రకారం ఐదో వంతు భాగం 20 శాతాన్ని పబ్లిక్‌ కాంట్రిబ్యూషన్‌ (దాతల వాటా) ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కల్యాణ మండప నిర్మాణానికి రూ. 2.50 కోట్లలో రూ.50 లక్షలు, దేవాలయ నిర్మాణానికి సంబంధించి రూ.75 లక్షలకుగాను రూ.18.75 లక్షలు దాతల వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని మంత్రి విడదల రజిని, కుమారస్వామి దంపతులు భరించేందుకు ముందుకు వచ్చారు. కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.18.75 లక్షల నిమిత్తం రెండు డిమాండ్‌ డ్రాఫ్ట్‌లను ఈనెల ఆరో తేదీన మంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులు ఆమె మరిది విడదల గోపీనాథ్‌ ఆధ్వర్యంలో తిరుమలలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డిని కలిసి అందజేశారు. దీంతో మొత్తం రూ.3.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలకు మార్గం సుగమమైంది.

వేగంగా నిర్మాణపనులు
ఎన్నో దశాబ్దాలుగా కలగానే మిగిలి ఉన్న టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు నా హయాంలో ప్రారంభం కానుండటం అదృష్టంగా భావిస్తున్నా. దీనికి సంబంధించి భూమి కేటాయింపు, అన్ని అనుమతులూ ఇప్పటికే లభించాయి. ఇక పనులు ప్రారంభించటమే తరువాయి. ఎవరి వద్ద నుంచి ఏమీ ఆశించకుండా దాతల వాటా కూడా చెల్లించాం. నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తాం.

– విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

మరిన్ని వార్తలు