కవితపై తరుణ్‌చుగ్ తీవ్ర వ్యాఖ్యలు

23 Feb, 2021 15:14 IST|Sakshi

బీజేపీలో చేరిన పాల్వాయి హరీష్‌ బాబు

సాక్షి, ఆదిలాబాద్‌‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని తరుణ్‌చుగ్‌ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌లో పర్యటించిన ఆయన.. అక్కడి కార్మికులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌, కవితపై విమర్శలు గుప్పించారు. సింగరేణికి కవిత యూనియన్‌ లీడర్‌గా మారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కార్మికులు, కార్మిక నేతలపై ఆధిపత్యం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి అవినీతికి అడ్డాగా మారిందన్నారు. సింగరేణిలో అవినీతిని చూస్తూ ఊరుకోమన్నారు. సింగరేణి సీఎండీ సరిగా పనిచేయడం లేదని,, టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కాగా తెలంగాణలో విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి తరుణ్‌చుగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీయే లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు సందిస్తున్నారు.

కుమ్రంభీమ్  జిల్లా  కాగజ్‌నగర్‌లో నిర్వహించిన చత్రపతి శివాజీ  సంకల్ప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్  తరుణ్ చుగ్ హజరయ్యారు. వీరి సమక్షంలో సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్  పాల్వాయి హరీష్‌ బాబు పార్టీలో చేరారు.  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పాల్వాయి హరీష్ బాబు, అయన అనుచరులను పార్టీలోకి  అహ్వనించారు. ఈ సభకు పాల్వాయి అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

మరిన్ని వార్తలు