కిడ్నాప్‌ తరహాలో జర్నలిస్ట్‌ అరెస్టా?: సంజయ్‌

4 Jun, 2021 12:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రభుత్వ లోపాలను ఎండగడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గుర్రంపోడు తండాలోని గిరిజన భూముల కబ్జా బాగోతాన్ని మీడియాలో కవర్‌ చేసినందుకు జర్నలిస్ట్‌ రఘుపై కేసు పెట్టారని తెలిసిందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఒక జర్నలిస్ట్‌ను కిడ్నాప్‌ తరహాలో అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జర్నలిస్ట్‌ రఘు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తడమే మీడియా బాధ్యత అని, అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని సంజయ్‌ హితవు పలికారు. 

హుజూర్‌నగర్‌ జైలుకు జర్నలిస్ట్‌ రఘు.. 14 రోజుల రిమాండ్‌
హుజూర్‌నగర్‌: హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్‌ రఘును సూర్యాపేట జిల్లా మఠంపల్లి పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు సబ్‌జైలుకు తరలించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్‌లో ఫిబ్రవరి 7న బీజేపీ ఆధ్వర్యంలో గిరిజన భరోసా యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆరోజు చోటుచేసుకున్న ఘటనలపై నమోదైన కేసులో జర్నలిస్ట్‌ రఘు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మఠంపల్లి పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని హుజూర్‌నగర్‌ కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో వెంటనే హుజూర్‌నగర్‌ సబ్‌ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు