కేంద్రం కఠిన వైఖరి.. మమత–మోదీ’ వివాదంలో మరో మలుపు 

2 Jun, 2021 03:09 IST|Sakshi

బెంగాల్‌ మాజీ సీఎస్‌కు డీఎం చట్టం కింద షోకాజ్‌ నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కారుకు పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ఘర్షణ ముదురుతోంది. బెంగాల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయకు కేంద్ర హోంశాఖ కఠినమైన డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (డీఎం) చట్టం కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బందోపాధ్యాయ రిటైర్‌మెంట్‌కు కొద్ది గంటల ముందు సోమవారం ఈ నోటీసులు ఆయనకు అందించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ ఆదేశాలను ధిక్కరించడం విపత్తు నిర్వహణ చట్టంలోని ‘సెక్షన్‌ 51బీ’ని ఉల్లంఘించడమేనని, దీనిపై మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో బందోపాధ్యాయను ఆదేశించారు. ఈ నిబంధన కింద రెండేళ్ల వరకు జైలు శిక్షకు అవకాశముంది. బందోపాధ్యాయ మే 31న రిటైర్‌ కావాల్సి ఉండగా, ఆయనకు తొలుత 3 నెలల పొడిగింపునిచ్చారు. ఆ తరువాత, తాజాగా సోమవారంలోగా కేంద్రానికి రిపోర్ట్‌ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆయనను ఆదేశించింది. అయితే, నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. బందోపాధ్యాయ మే 31న పదవీ విరమణ చేస్తున్నారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అదే రోజు ప్రకటించారు.

ఆ వెంటనే ఆయనను మూడేళ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.  విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 51బీ ప్రకారం.. కేంద్రం, లేదా సంబంధిత అధికార యంత్రాంగం ఈ చట్టం కింద ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించడం శిక్షార్హమైన నేరం. దీనికి ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష, లేదా జరిమానా లేదా ఆ రెండూ విధించే అవకాశముంది. ఒకవేళ ఈ ఆదేశాలను ధిక్కరించిన ఫలితంగా ప్రజల ప్రాణాలు పోయినట్లయితే.. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. పెను తుపాను యాస్‌ విధ్వంసం, సహాయ చర్యలపై ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు బందోపాధ్యాయ కూడా హాజరు కాని నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఆయనకు నోటీసులు జారీ చేసిందని మమత ఆరోపించారు.  


అహమే ఆమెకు ముఖ్యమైంది!: గవర్నర్‌ 
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం మధ్య ఇప్పటికే విభేదాలు తీవ్ర స్థాయికి చేరగా రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధనకర్‌ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ప్రజాసేవపై ఆసక్తి కంటే అహమే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యాస్‌ తుపాను కారణంగా జరిగిన నష్టంపై మే 28వ తేదీన ప్రధాని మోదీ పశ్చిమ మేదినీపూర్‌ జిల్లా కలైకుందలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి సీఎం మమత గైర్హాజరు కావడంపై మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధానితో సమావేశానికి ముందు రోజు సీఎం మమత నాకు ఫోన్‌ చేసి, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆ భేటీకి హాజరైతే తాను హాజరుకానని తెలిపారు. ఆ తర్వాత సీఎంతోపాటు, అధికారులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు నాకు సమాచారం అందించారు. ప్రజాసేవ కంటే అహమే ముఖ్యమైంది’అని గవర్నర్‌ అన్నారు. అప్పటి ప్రధాని సమావేశానికి గవర్నర్‌ ధన్‌కర్, సువేందు అధికారితోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దేవశ్రీ చౌధురి పాల్గొన్నారు. గవర్నర్‌ ధన్‌కర్‌ ట్వీట్లపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ స్పందిస్తూ..‘రాష్ట్ర ప్రజల కోసం మమత నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఏది చేయాలో ఆమెకు తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే హక్కు గవర్నర్‌కు లేదు’అని పేర్కొన్నారు.

ఆ నోటీస్‌లో ఏముంది? 
‘‘యాస్‌’ తీవ్రతను పరిశీలించడానికి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ కలైకుండ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కోసం 15 నిమిషాల పాటు ఎదురుచూశారు. ఆ తరువాత, ప్రధాని నిర్వహించిన సమీక్ష సమావేశానికి వస్తున్నారా? లేదా? అని కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సందేశం పంపించారు. కాసేపటికి, ముఖ్యమంత్రి, తనతో పాటు వచ్చిన ప్రధాన కార్యదర్శి.. ఇద్దరు రూమ్‌లోనికి వచ్చి వెంటనే వెళ్లిపోయారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి చైర్మన్‌ కూడా అయిన ప్రధాని నిర్వహించిన సమీక్ష మావేశానికి ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడం విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 51బీని ఉల్లంఘించడమే అవుతుంది’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు