కమలదళంలో చేరిక లాంఛనమేనా?  

1 Jun, 2021 03:07 IST|Sakshi

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఈటల భేటీ 

పార్టీలో చేరితే సముచిత స్థానం ఇస్తామని నడ్డా హామీ  

 సుమారు 45 నిమిషాల  పాటు చర్చలు 

సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఈటల సోమవారం సాయంత్రం బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ ఛుగ్, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియర్‌ నేత జి.వివేక్‌ వెంకట్‌స్వామిలతో కలిసి నడ్డాను కలిశారు. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలు, పార్టీలో చేరిక సహా అనేక అంశాలపై ఈటలతో నడ్డా చర్చించారు.  
 
ఉద్యమకారులకు అన్యాయం 
విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం తొలుత నడ్డాతో తరుణ్‌ ఛుగ్, బండి సంజయ్‌ ప్రత్యేకంగా 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటలకు ఈ ఇరువురు నాయకులతోపాటు ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్‌ రెడ్డి, వివేక్‌లు నడ్డాతో భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకుంటానని ఈటల నడ్డాకు తెలియచేశారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందని, దీనికి బలం చేకూర్చేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈటల చెప్పారు.

కేంద్రం ప్రకటించిన ఏ పథకాన్ని అయినా నేరుగా అమలు చేయకుండా, తొలుత కేసీఆర్‌ విమర్శిస్తారని, ఆ తరువాత మళ్లీ కేంద్ర పథకాన్ని అమలు చేయడంతో ప్రజల్లో అనుమానానికి బలం చేకూరుతోందని ఆయన చెప్పారు. ఇటీవల ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకం అమలు విషయంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తుపెట్టుకుంటే తన మాదిరిగా బీజేపీని నమ్మి పార్టీలో చేరే వారి పరిస్థితిపై ఎలాంటి భరోసా ఇస్తారని ఈటల ప్రశ్నించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికలనాటికి అధికారంలోకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.  
 
సముచిత స్థానం కల్పిస్తాం 
పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు, సరైన గౌరవం కల్పిస్తామని ఈటలకు నడ్డా హామీ ఇచ్చారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని, భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని నడ్డా చెప్పారు. టీఆర్‌ఎస్‌ విధానాలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుంభకోణాల విషయంలో ఎప్పుడు స్పందించాలన్న విషయంలో తమకు స్పష్టత ఉందని, సమయానుకూలంగా చర్యలు ఉంటాయని ఈటలకు ఆయన వివరించారు. పార్టీలో చేరే విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నడ్డా కోరారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తులతో చర్చలు జరిపే విషయంతో పాటు, పార్టీ బలోపేతానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై తరుణ్‌ ఛుగ్‌తో ఈటల చర్చించారు.   

మరిన్ని వార్తలు