టీడీపీవి డైవర్షన్‌ పాలిటిక్స్‌

2 Jun, 2021 04:57 IST|Sakshi

తెలుగు డ్రామా పార్టీలో అన్నీ రిహార్సల్సే

వీడియో లీక్‌తో వారి స్వరూపం బట్టబయలు

ప్రభుత్వం పేదలకు రూ.1.31 లక్షల కోట్లు ఇచ్చిందనే కడుపుమంట

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఫరిడవిల్లుతుండటం, సీఎం జగన్‌ రెండేళ్ల పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతుండటంతో.. టీడీపీ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. దేనికైనా తెలుగు డ్రామా పార్టీలో ముందే రిహార్సల్స్‌ ఉంటాయని చెప్పారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు నిర్వహించిన రిహార్సల్స్‌లో చంద్రబాబు, యనమల, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వీడియో లీక్‌ కావడంతో, వారి రాజకీయ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. ఆ వీడియోలో పార్టీకి ఎస్టీలు, మైనార్టీలు, బీసీల్లో చాలామంది దూరమయ్యారని సోమిరెడ్డి అన్నారని, ఇవన్నీ నిజమేనని యనమల అంగీకరించారని, ఇవన్నీ నిజమైనా బయటకు రాకుండా మాట్లాడండి అని చంద్రబాబు చెబుతున్నారని వివరించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ చెబుతోందని గుర్తుచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎం జగన్‌కి మంచి పేరు రాకూడదన్నదే వీరి ఆలోచనన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రూ.1.31 లక్షల కోట్లు పేదలకు ఇచ్చిందని టీడీపీకి కడుపుమంట అని చెప్పారు. యనమల ఆందోళన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాదని, టీడీపీ పరిస్థితిమీదేనని చెప్పారు.

టీడీపీ సర్టీఫికెట్‌ అవసరం లేదు
సీఎం జగన్‌ పరిపాలన దక్షత వల్లే అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు. రెండేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా సీఎం జగన్‌ పుస్తకం విడుదల చేస్తే, టీడీపీ నుంచి సర్టీఫికెట్‌ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ వర్గానికి ఎంత మేలు చేశామో గణాంకాలతో సహా చెబుతున్నామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో.. లబ్ధిదారులు, ఏ పథకానికి ఎంత ఇచ్చామో కూడా ప్రకటిస్తున్నామని గుర్తుచేశారు. టీడీపీ కొంతమంది శ్రేయస్సు కోసం పనిచేస్తే.. సీఎం జగన్‌ సకల జనావళి శ్రేయస్సే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. సమాజంలో సమతౌల్యత సాధించాలని సీఎం జగన్‌ చూస్తున్నారన్నారు. అగ్రకులాల్లో పేదలను కూడా ఆదుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చుని రోజూ జూమ్‌లో ఒక కథ అల్లడం, డ్రామా చేయడం, అనుకూల మీడియాలో పెద్దఎత్తున చూపించుకుని ఆనందపడి నిద్రపోవడం చంద్రబాబుకు రోజువారీ కార్యక్రమంగా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఉచిత సలహాలు మాని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.   

మరిన్ని వార్తలు