సీఎం స్టాలిన్‌ ఉద్వేగం: ‘నాన్నకు ప్రేమతో..’ 

4 Jun, 2021 07:04 IST|Sakshi
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న స్టాలిన్‌ తదితరులు

సగర్వంగా సమాధి వద్దకు వస్తున్నా

కరుణానిధిని ఉద్దేశిస్తూ స్టాలిన్‌ వీడియో 

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మీకు ఇచ్చిన హామీని నెరవేర్చానని సగర్వంగా తలెత్తుకుని తెలియజేసేందుకు మీ వద్దకు (చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణ సమాధి) వస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. తన తండ్రి కరుణానిధి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‘తలై నిమిర్దిందు వరుగిరేన్‌’ (తలెత్తుకుని వస్తున్నాను) పేరున ఉద్వేగపూరితమైన వీడియో ను గురువారం విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘తిరువారూరులో ఉద్భవించి తమిళనాడునే తన సొంతూరుగా మార్చుకుని, నేతలకే నేతగా, ముఖ్యమంత్రులకే ముఖ్యమంత్రి కలైంజ్ఞర్‌. జూన్‌ 3వ తేదీ మీ జయంతి మాత్రమే కాదు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే కోట్లాది ప్రజలందరినీ ఉత్తేజితులను చేసేరోజు. ఈ రోడ్డులో ఒకరోజు నేను చేసిన ప్రతిజ్ఞను సహచరుల సహకారంతో నెరవేర్చి చూపాను.

ఈ విషయాన్ని సగర్వంగా చాటుకునేందుకు మీ వద్దకు వస్తున్నాను. మీరు మరణించలేదు, పైనుంచి నన్ను గమనిస్తున్నారని, ఇంకా గమనిస్తూనే ఉంటారని భావిస్తున్నాను. జార్జికోట (చెన్నై సచివాలయం)ను అధిరోహించిన నాటి నుంచే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలేందుకు పాటుపడుతున్నాము. పాటుపడాలి, సాధించాలని అనేలా నన్ను తీర్చిదిద్దారు. మీరు చెప్పిన ఆ మాటలకు అద్దంపట్టేలా నడుచుకుంటున్నాను. ‘ఎవరైతే నిన్ను ప్రశంసించడం లేదు, వారిచేత ప్రశంసలు పొందేలా నడుచుకోవాలి’ అంటూ చెప్పిన మాటలు గుర్తున్నాయి. మీ మాటలే నాకు శాసనం. మీ జీవితం నాకు పాఠం. మీ వారసుడిగా విజయపూరితమైన సమాచారంతో మీ వద్దకు వస్తున్నాను. శుభాకాంక్షలు అని దీవించండి మహా నాయకుడా’ అని వీడియో సందేశం ద్వారా తన తండ్రికి స్టాలిన్‌ నివాళులర్పించారు.

చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు   
ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

మరిన్ని వార్తలు