కోవిడ్‌ బెడ్‌పై నుంచే శశి థరూర్‌ సందేశం: వీడియో వైరల్‌

2 Jun, 2021 12:11 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై  కేంద్రంపై శశిథరూర్  విమర్శలు

కరోనా మహమ్మారినుంచి దేశాన్ని కాపాడండి!

ఉచిత సార్వత్రిక టీకా కార్యక్రమమే రక్ష!

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్  కేంద్రంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు. ముఖ్యంగా మోదీ సర్కార్‌ అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ విధానంపై శిశిథరూర్  విమర్శలు గుప్పంచారు. కోవిడ్‌ సంబంధిత  సమస్యలో బాధపడుతున్న ఆయన అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించాలంటూ బుధవారం ట్విటర్‌ వేదికగా  కేంద్రాన్ని డిమాండ్ చేశారు. "కోవిడ్  బారినుంచి దేశాన్ని రక్షించండి. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి" అంటూ దాదాపు రెండు నిమిషాల నిడివి గల వీడియోను ట్వీట్‌ చేశారు. ఎక్కడ చూసినా వ్యాక్సిన్ల తీవ్ర కొరత వేధిస్తున్నసమయంలో డిసెంబరు చివరి నాటికి అందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారో తనకు అర్థం కావడం లేదంటూ ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా భారతీయులందరికీ సార్వత్రిక టీకాలు వేసేలా ప్రభుత్వ విధానంలో భారీ మార్పులు చేయాలంటూ భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన విస్తృత ప్రచారానికి తాను మద్దతిస్తున్నానని, డిసెంబర్‌లోగా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కేరళ తిరువనంతపురానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌ బెడ్‌ మీద నుంచే మాట్లాడుతున్నానంటూ ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. సుదీర్ఘమైన కోవిడ్ సంక్రమణ సమస్యలతో బాధ పడుతున్నానని ఆయన వెల్లడించారు. కోవిడ్‌తో తాను చాలా బాధపడుతున్నాననీ, తనలా తన పౌరులు బాధ పడకూడదన్నారు. ఉచిత టీకా కార్యక్రమమే దేశాన్ని కాపాడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ డిసెంబరు చివరికల్లా వ్యాక్సినేషన్ ఇస్తామనే గడువుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అన్నారు. అంతేకాదు టీకాల  ధరల వ్యత్యాసంపై కూడా ఆయన నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాలే వ్యాక్సిన్ సేకరించు కోవాలన్న కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని శశిథరూర్ పేర్కొన్నారు.

చదవండి : Vaccination : గుడ్‌న్యూస్‌ చెప్పిన డీసీజీఐ

మరిన్ని వార్తలు