మోసాల చరిత్ర కాంగ్రెస్ ది- త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ ది

15 Oct, 2020 19:13 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర బీజేపీ దళిత మోర్చ కౌన్సిల్‌ మెంబర్‌ ఎల్లం(ఎల్లయ్య)తో పాటు దాదాపు 150 మంది జిల్లాలోని మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అలాగే మిరుదొడ్డి కాంగ్రెస్‌తో పాటు‌, ఇతర పార్టీల నేతలు అధిక సంఖ్యలో గురువారం టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకకు సముద్రం అంత సాయం కేసీఆర్ ప్రభుత్వం చేస్తే, బీజేపీ కాకి రెట్టంత కూడా సాయం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారానికి నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ దుబ్బాక పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మైకులే ఫెయిల్ అయ్యాయని, పరాయి లీడర్లు, పరాయి కార్యకర్తలతో నుడుపుతున్న కాంగ్రెస్ సమావేశాల్లో ప్రజలు అసలే లేరని విమర్శించారు. 

కాంగ్రెస్, బీజేపీ పోటీలు రెండో స్థానం కోసమేనన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ , కేసీఆర్ లేకపోతే ఉత్తమ్ జై తెలంగాణ అనే వారా?.. కాదనుకున్న తెలంగాణను ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి తెచ్చిన కేసీఆర్ దా మోసం? అని ప్రశ్నించారు. ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగి తెలంగాణకు మోసం చేయలేదా అని ఉత్తమ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోసాల చరిత్ర కాంగ్రెస్ ది- త్యాగాల చరిత్ర టీఆర్ఎస్ పార్టీది అన్నారు. దుబ్బాక, సిద్దిపేట నేతలు మాత్రమే ఇక్కడ ఉన్నామని, ఉత్తమ్ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నాయకులను తెచ్చుకుంటున్నారని మంత్రి విమర్శించారు.

మరిన్ని వార్తలు