నితీష్‌కు షాక్‌: 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!

31 Dec, 2020 17:04 IST|Sakshi

కలకలం రేపుతున్న ఆర్జేడీ వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్‌పై తిరుగుబాటు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జేడీయూ చెందిన 17 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత శ్యామ్‌ రాజక్‌ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీతో కూటమిగా ఏర్పడి మైనర్‌ భాగస్వామ్య పక్షంగా నిలిచిన జేడీయూతో కలిసి ఉండేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన అన్నారు. అంతేకాకుండా నితీష్‌ కుమార్‌ పేరుకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్నారని, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు మొత్తం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే నడుస్తున్నాయని పేర్కొన్నారు. జేడీయూ చెందిన 17 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులన్నీ బీజేపీ నేతలకే కట్టబెట్టారని జేడీయూ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారని ఆయన ఆరోపించారు. రాజక్‌ ప్రకటనతో నితీష్‌ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. (బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలు!)

ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విపక్ష గూటికి చేరడం ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ తరుణంలో ఆర్జేడీ నుంచి పొంచి ఉన్న ముప్పును తట్టుకునేందుకు నితీష్‌ సిద్ధమవుతున్నారు. రాజక్‌ ప్రకటన అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన నితీష్‌... ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తేజస్వీ యాదవ్‌ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉంటారని, బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఉందని ప్రకటించారు. తిరుగుబాటు అనేదానికి తమ పార్టీలో చోటులేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందగా.. ఆర్జేడీ 75 స్థానాలతో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం శాసనసభలో విపక్ష కూటమికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అధికారపక్షానికి 127 మంది సభ్యులు ఉన్నారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మె‍ల్యేలు)

మరోవైపు ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పి తమతో చేతులు కలపాలని ఇటీవల ఆర్జేడీ నితీష్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. తేజస్వీ యాదవ్‌కు బిహార్‌ సీఎం పగ్గాలు అప్పగిస్తే రానున్న (2024) పార్లమెంట్‌ ఎన్నికల్లో విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీష్‌ను ఎన్నుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్జేడీ సీనియర్‌ నేత ఉదయ్‌ నారాయణ్‌ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్‌ కుమార్‌ ఇంకా బీజేపీ మైనర్‌ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా  మారింది. 

మరిన్ని వార్తలు