ఆజాద్‌ పార్టీకి షాక్.. తిరిగి కాంగ్రెస్ గూటికి 17 మంది కశ్మీర్ నేతలు..

7 Jan, 2023 04:55 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్‌తో కలిసివెళ్లిన 17 మంది సీనియర్ నాయకులు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వీరంతా సొంతగూటికి చేరుకున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి రెండు వారాల ముందు వీరంతా మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిస్తోంది. సొంతగూటికి వచ్చిన 17 మంది కాంగ్రెస్ నాయకుల్లో కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, పీసీసీ మాజీ చీఫ్ పీర్జాద మహమ్మద్ సయీద్ వంటి ముఖ్య నాయకులున్నారు. 

వీరంతా రెండు నెలల క్రితం గులాం నబీ ఆజాద్‌తో కలిసి కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. ఆయన స్థాపించిన కొత్త పార్టీలో చేరారు. అయితే పార్టీలో తమకు విలువ ఇవ్వడం లేదని, ఆయనను నమ్మి మోసపోయామని కొద్ది రోజుల క్రితమే వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాద్ పార్టీ నుంచి కొందరు సస్పెండ్ కూడా అయ్యారు.

శుక్రవారం మొత్తం 19 మంది కశ్మీర్ నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. అయితే ఇద్దరు కశ్మీర్ నుంచి ఢిల్లీ రాలేకపోయారు. గులాం నబీ ఆజాద్ కూడా తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారా? అని కేసీ వేణుగోపాల్‌ను ప్రశ్నించగా.. తనకు ఆయన గురించి ఏమీ తెలియదని చెప్పారు. కాంగ్రెస్ సిద్దాంతాలను నమ్మేవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చని స్పష్టం చేశారు.
చదవండి: ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..

మరిన్ని వార్తలు