Jai Bharat Satyagraha: రాహుల్‌కు 19 రాజకీయ పార్టీల మద్దతు.. దాని గురించి బాధ లేదు: జైరాం రమేశ్

28 Mar, 2023 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నెల రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జై భారత్ సత్యాగ్రహ పేరుతో మంగళవారం సాయంత్రం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇక నెల రోజుల పాటు కాంగ్రెస్ శ్రేణులు బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అయితే ఈ నిరసన కార్యక్రమం కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో 'సేవ్ డెమొక్రసీ' పేరుతో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నట్లు చెప్పారు.

అలాగే రాహుల్ గాంధీకి 19 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు జైరాం వివరించారు. అనర్హత వేటు, బంగ్లా ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులపై ఆయనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే సేన కూడా రాహుల్‌కు ఈ విషయంలో మద్దతుగానే ఉందని పేర్కొన్నారు.

పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించిన 24 గంటల్లోనే ఆయను ఎంపీ పదవి నుంచి తొలగించారని,  ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన 24 గంటల్లోనే ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని జైరాం గుర్తు చేశారు. లోక్‌సభ సెక్రెటేరియెట్ జెట్ స్పీడు చూసి తమకు ఆశ్చర్యం వేసిందని సెటైర్లు వేశారు. కానీ రాహుల్ గాంధీకి వీటి గురించి ఎలాంటి ఆందోళన లేదని వాళ్లకు తెలియదన్నారు.

అలాగే సూరత్ కోర్టు తీర్పును రాహుల్ సవాల్ చేసే విషయంపైనా జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ అప్పీల్ చేయాలో తమకు తెలుసునని, న్యాయ నిపుణులతో దీనిపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేసేందుకు రాహుల్‌కు 30 రోజుల వరకు గడువుంది.

దేశంలో దొంగల ఇంటి పేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే దీనిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 24 గంటల్లోనే రాహల్‌పై ఎంపీగా అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
చదవండి: రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..

మరిన్ని వార్తలు