మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

22 Feb, 2021 04:21 IST|Sakshi

పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తీవ్రం

నేడు బలపరీక్ష ఎదుర్కోనున్న సీఎం నారాయణ స్వామి

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌– డీఎంకేల అధికార కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి సర్కారుకు ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామా రూపంలో మరో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఆదివారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కే లక్ష్మి నారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్‌ వీపీ శివకొలుందుకు అందజేశారు. ఈ రాజీనామాలతో అధికార పక్షం బలం ఒక ఇండిపెండెంట్‌ సభ్యుడితో కలుపుకుని 12కి చేరింది. తమకు మద్దతిస్తున్న నామినేటెడ్‌ సభ్యులు ముగ్గురితో కలుపుకుని విపక్ష సభ్యుల సంఖ్య 14గా ఉంది. మొత్తం 33(ముగ్గురు నామినేటెడ్‌ సభ్యులు కలుపుకుని) మంది సభ్యుల అసెంబ్లీలో ఏడు ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సీఎం నారాయణస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.

బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు నామినేటెడ్‌ సభ్యులకు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్‌ సభ్యులకు బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు ఉండదని, అయినా, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పటికే సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేశానన్నారు. అయితే, వెంకటేశన్‌ మాత్రం తాను డీఎంకేలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయడం లేదని, దాంతో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని వివరించారు. ఇద్దరు మాజీ మంత్రులు నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు.
 

మరిన్ని వార్తలు