2024 ఎన్నికలు: పాన్ ఇండియా లెవల్‌లో తనిఖీలు షురూ

9 Jun, 2023 13:41 IST|Sakshi

ఢిల్లీ: వచ్చే ఏడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టింది కేంద్రం ఎన్నికల సంఘం. ఈ మేరకు మొదటి స్థాయి తనిఖీలను పాన్‌ ఇండియా లెవల్‌లో మొదలుపెట్టింది. మొదటి స్థాయి తనిఖీ (FLC) ప్రక్రియలో.. మాక్ పోల్స్ కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈసీ స్పష్టం చేసింది.

ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రక్రియ. ముందుగా కేరళలోని అన్ని నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టాం. మొదటి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాల్లో ఈవీఎంలు, పేపర్‌ట్రైల్‌ మెషిన్ల తనిఖీలను దశల వారీగా నిర్వహిస్తున్నాం అని ఈసీ పేర్కొంది. ఈ తరుణంలో వయనాడ్‌లోనూ నిర్వహిస్తున్నారా? అని మీడియా ఎన్నికల ప్రతినిధిని వివరణ కోరగా.. ఎన్నికల కమిషన్‌ విడుదల చేసే క్యాలెండర్‌, తదనంతరం స్టేట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్లు జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని పేర్కొన్నారు. 

పరువు నష్టం దావా కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడడం, లోక్‌సభ సభ్యుడిగా ఆయన సభ్యత్వం రద్దు కావడం తెలిసిందే. దీంతో వయనాడ్‌ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. 

ఇక లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ చేపట్టనుంది ఈసీ. అలాగే ప్రస్తుతానికి వయనాడ్‌(కేరళ)తో పాటు పూణే(మహారాష్ట్ర), చంద్రాపూర్‌(మహారాష్ట్ర), ఘాజిపూర్‌(యూపీ), అంబాలా(హర్యానా) లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

FLCలో ఏం చేస్తారంటే.. 
మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియలో.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు(EVMs), పేపర్‌ట్రైల్ మెషీన్‌లు రెండు పరికరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలైన BEL, ECILలు ఈ రెండు మెషిన్లను తయారు చేస్తున్నాయి. దీంతో వాటి నుంచి రప్పించిన ఇంజనీర్లు వాటిని తనిఖీ చేసి.. ఏమైనా లోపాలు ఉన్నాయా? గుర్తిస్తారు. లోపభూయిష్ట యంత్రాలు మరమ్మత్తు చేయడం, లేదంటే రీప్లేస్‌మెంట్‌ కోసం తీసుకెళ్తారు.

ఎఫ్‌ఎల్‌సీలో మరో కీలకమైన ప్రక్రియ.. మాక్‌ పోలింగ్‌. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ రెండు యంత్రాలను తనిఖీ చేసేందుకు మాక్ పోల్ కూడా నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు