29 మంది మంత్రులు, నో డిప్యూటీ సీఎం : బసవరాజ్‌ బొమ్మై

4 Aug, 2021 13:35 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కేబినెట్‌ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం నేతృత్వంలో కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాత, కొత్త మేలు కలయికతో కేబినెట్‌లో మొత్తం 29 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం బొమ్మై ప్రకటించారు. అలాగే  డిప్యూటీ సీఎం ఎవరూ ఉండకూడదని హైకమాండ్ నిర్ణయించిందని బెంగళూరులో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప నేతృత్వంలోని కేబినెట్‌లో,  ముగ్గురు డిప్యూటీ సీఎంలున్న సంగతి తెలిసిందే. 

సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేసినట్టు  సీఎం తెలిపారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో వేడుకకు హాజరయ్యే వారు మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అలాగే ఎవరూ  పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని కూడా చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

మరోవైపు మంత్రుల అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుదారులు తమ నాయకులను ఎంపిక చేయకపోవడంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.  ముఖ్యంగా హవేరి ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు. అలాగే యడ్యూరప్ప హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ఆనంద్ మమణి తనను మంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానంటూ బెదిరింపుకు దిగారు. కాగా జూలై 28 న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొమ్మై క్యాబినెట్‌పై నిర్ణయం తీసుకునే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనే  ఐదు రోజులు గడపటం గమనార్హం.
 


 

మరిన్ని వార్తలు